ప్రభాస్‌తో మరో సినిమాపై రాజమౌళి క్లారిటీ

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి, బాహుబలి-2 ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ కలెక్షన్లను కూడా సాధించింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అంతకుముందు రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అని చెప్పవచ్చు.

rajamouli

ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై తాజాగా రాజమౌళి స్పందించాడు. బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాలు కలిపి పనిచేశామని, మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో అని రాజమౌళి చెప్పాడు. అయితే ఆ తర్వాత మళ్లీ సరదాగా అలా అన్నానని, నిజంగా ప్రభాస్ తో సినిమా చేయడమంటే తనకు ఇష్టమేనన్నాడు.

మంచి కథ కుదిరితే తప్పకుండా మళ్లీ సినిమా చేస్తామని రాజమౌళి చెప్పాడు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్-రాంచరణ్ హీరోలుగా ఆర్‌ఆర్‌ఆర్ అనే పాన్ ఇండియా మూవీని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయనున్నాడు.