పెళ్లి సందడికి 25 ఏళ్లు.. ఎమోషనల్ అయిన దర్శకేంద్రుడు

శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 25 ఏళ్లు అవుతోంది. అశ్వనీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్‌లు నిర్మించిన ఈ సినిమా 1996వ సంవత్సరంలో జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించగా.. ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కీరవాణి అందించిన పాటలు కూడా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

pelli sandadi 25 years

అప్పట్లో ఈ సినిమా మూడు నంది అవార్డులను గెలుచుకోగా.. హిందీ, తమిళంలోకి కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు. అక్కడి అభిమానులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌ తెరకెక్కుతుండగా.. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన సహాయకురాలు గౌరీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

పెళ్లి సందడి విడుదలై 25 ఏళ్ల అయిన సందర్భంగా రాఘవేంద్రరావు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘పెళ్లి సందడి` నేటికి సినిమా విడుదలై 25ఏళ్లు అయ్యింది. ‘నా కెరీర్‌లో, శ్రీకాంత్‌ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్‌లకు నమస్కరిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.