నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌కి పితృవియోగం

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావుగారు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఈస్థాయికి రావడం వెనుక తాతయ్య కృషి, శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ సోదరుడు మురళి కుమారుడు రామ్ అనే సంగతి తెలిసిందే.

రామ్ మాట్లాడుతూ “తాతయ్య… మీది రాజులాంటి మనసు. విజయవాడలో లారీ డ్రైవర్ గా జీవితం ప్రారంభించిన మీరు… కుటుంబానికి అన్ని వసతులు, సౌకర్యాలు అందించడం కోసం లారీ పక్కన నిద్రించిన రోజులు ఉన్నాయి. మన దగ్గర ఉన్న సంపదను బట్టి ఎవరూ శ్రీమంతులు కారని, మంచి మనసు ఉన్నవాళ్లు శ్రీమంతులు అవుతారని మీరు మాకు నేర్పించారు. మీ పిల్లలు అందరూ ఇవాళ ఉన్నతస్థాయిలో ఉన్నారంటే… అందుకు కారణం మీరే. ఉన్నత కలలు కనడంతో పాటు సాకారం చేసుకునేలా వాళ్లను ప్రోత్సహించారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను” అని అన్నారు