ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పీడీవీ ప్రసాద్ ఇంట్లో విషాదం

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పి.డి.వి ప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది . పి.డి.వి ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ ఇవాళ కన్నుమూశారు. గుండె నొప్పితో గత కొంతకాలంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.


ఆమె వయస్సు 53 ఏళ్లు. అంజు ప్రసాద్ అంత్యక్రియలు రేపు హైదరాబాద్‌లో జరగనున్నాయి. పీడీవీ ప్రసాద్ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అంజు ప్రసాద్ మరణంతో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాగా పీడీవీ ప్రసాద్ టాలీవుడ్‌లో అందరికీ సుపరిచితమే. ఆయన తీసిన చాలా సినిమాలు భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం హారిక హాసిని నిర్మాణ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. సీతార ఎంటర్‌టైన్‌మ్మెంట్ బ్యానర్‌పై వచ్చే సినిమాలకు సమర్పకుడగా కూడా వ్యవహరిస్తున్నాడు.