సందర్శనార్థం రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో దొరస్వామిరాజు భౌతికకాయం

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత వి.దొరస్వామిరాజు అనారోగ్యంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దొరస్వామిరాజు వయస్సు 75 సంవత్సరాలు. 1946వ సంవత్సరంలో జులై 1న చిత్తూరు జిల్లాలోని వరదరాజు కండ్రిగలో వెంకటరాజు, చెంగమ్మ దంపతులకు ఆయన జన్మించారు. దొరస్వామిరాజు భార్య పేరు నిర్మల కాగా.. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు విజయ్ కుమార్ వర్మ కాగా.. కుమార్తె పేరు విజయ లక్ష్మీ.

doraswamyraju film chamber

నాగార్జునతో కిరాయి దాదా, అన్నమయ్య, ప్రెసిడెంట్ గారి పెళ్లాం సినిమాలను దొరస్వామిరాజు తీశారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుతో సీతారామయ్యగారి మనవరాలు, మాధవయ్య గారి మనవడు సినిమాలను తీశారు. ఇక జగపతిబాబుతో భలే పెళ్లాం, వినోద్ కుమార్‌తో శభాష్ రాము సినిమాలను తీశారు.
తన సినిమాలకు గాను ఎన్నో జాతీయ అవార్డులతో పాటు నంది అవార్డులను ఆయన గెలుచుకున్నారు.
దొరస్వామిరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. దొరస్వామిరాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా రేపు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు దొరస్వామిరాజు పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఉంచనున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్థివదేహాంకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం జూహ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.