పవన్‌ v/s ప్రకాష్‌రాజ్ : ప్రకాష్‌రాజ్ మరోసారి వ్యాఖ్యలు

ప్రకాష్‌రాజ్, పవన్ అభిమానుల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పవన్ ఒక ఊసరవెల్లి అంటూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రకాశ్ రాజ్‌పై పవన్ అభిమానులు విమర్శలు కురిపిస్తుండగా.. ప్రకాశ్ రాజ్ కూడా వాళ్లకి ధీటుగా సమాధానం ఇస్తున్నాడు. దీంతో పవన్ అభిమానులు, ప్రకాశ్ రాజ్ మధ్య చోటుచేసుకుంటున్న మాటలయుద్ధం ఎటువైపు దారి తీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

pawan

ప్రకాశ్ రాజ్ నోరు అదుపులో పెట్టుకోవాలని మెగాబ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. నోరు జాతితే మాములుగా ఉండదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. ఈ వార్నింగ్‌తో నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చాడు. నీ భాష నాకు మాట్లాడటం రాదంటూ ప్రకాశ్ రాజ్ బదులిచ్చాడు. ఈ వివాదంపై తాజాగా మరోసారి ప్రకాశ్ రాజ్ స్పందించాడు.

పవన్‌తో సైద్ధాంతిక అభిప్రాయాలు తప్పితే తమ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి బేధాలు ఉండవని ప్రకాశ్ రాజ్ చెప్పాడు. పవన్ సిద్ధాంతాలతో తాను ఏకీభవించనని, పొలిటికల్‌గా మా మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చన్నాడు. పవన్ అంటే తనకు ఇష్టమని, కానీ రాజకీయాల్లో కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నాయన్నాడు. ఇదే విషయంతో పవన్‌తో కూడా చెప్పానని, పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ మూవీలో కూడా తాను నటిస్తున్నానని ప్రకాశ్ రాజ్ చెప్పాడు.

వకీల్ సాబ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నానని, తాము షూటింగ్‌లో రాజకీయాల గురించి చర్చించుకుంటామని ప్రకాశ్ రాజ్ తెలిపాడు. షూటింగ్ అనగానే మళ్లీ కలిసిపోతామని, సెట్స్‌లో ఇదివరకే తమ పాయింట్ల మీద తాము తీవ్రంగా డిస్కస్ చేశామని ప్రకాశ్ రాజ్ చెప్పాడు. పవన్, తన మధ్య ఎలాంటి విభేధాలు లేవని, తాను రాసిన దోసిట చినుకులు అనే పుస్తకాన్ని పవన్ రిలీజ్ కూడా చేశారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు.