కరుణానిధిగా రెండోసారి నటించబోతున్న ప్రకాష్ రాజ్

బాలీవుడ్ క్వీన్ గా హిందీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్. నార్త్ నుంచి ఇప్పుడు సౌత్ ని టార్గెట్ చేసిన కంగనా, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బయోపిక్ లో నటించనుంది. అన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలో కూడా తెరకెక్కనున్న ఈ సినిమాకి త‌లైవి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం కంగనా తమిళ్ నేర్చుకోవడంతో పాటు క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంటోంది. తలైవి సినిమాలో జ‌య‌ల‌లిత జీవితాన్ని నాలుగు ద‌శ‌ల్లో చూపించేలా అద్భుతమైన కథనంతో విజయేంద్ర ప్రసాద్ అందరినీ మెప్పించే కథ రాశాడని తెలుస్తోంది. ఈ కథ కథనాలకి సరిపడేలా తలైవి కోసం కంగ‌నా కూడా నాలుగు షేడ్స్‌లో క‌న‌పించడానికి తన లుక్ లో చేంజెస్ చేస్తోంది.

ఇదిలా ఉంటే తలైవి సినిమాలో జయలలిత జీవితం చూపించడం ఎంత ముఖ్యమో, ఎం.జి.రామచంద్రన్ పాత్ర చూపించడం కూడా అంతే ముఖ్యం. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టే ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ కి, జయలలితకు ఉన్న ఏకైక ప్రత్యర్థి కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మణిరత్నం తెరకెక్కించిన మాస్టర్ పీస్ ఇద్దరు మూవీలో కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన సంగతి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల అరవింద స్వామి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు రావడం తలైవి సినిమాకి బలంగా మారింది.