ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి- ఆర్ నారాయణ మూర్తి

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి నటిస్తూ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రైతన్న’. రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా ఫంక్షన్ లో ప్రజా గాయకుడు గద్దర్, నారాయణమూర్తి గురించి మాట్లాడుతూ ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడని చెప్పారు. గద్దర్ చెప్పిన ఈ మాటలు నెట్ లో వైరల్ అయ్యి, ఆర్ నారాయణ మూర్తికి ఆర్ధిక సాయం చేస్తామని ఒకరు… ఉండడానికి ఇళ్లు ఇస్తామని ఇంకొకరు… మంచి వాళ్ళకే కష్టాలోస్తాయి అని ఇంకొకరు ఇలా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇవి ఆర్ నారాయణ మూర్తి వరకూ వెళ్లడంతో, గద్దర్ మాటలను వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన చెందారు. పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నా. ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి, ఇంటి అద్దె కట్టుకోలేనా సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి. కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చా అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఒక వ్యక్తి గురించి వార్తలు రాసే ముందు, అతని గురించి మాట్లాడే ముందు మనం అంతా ఆలోచించాలి. ముఖ్యంగా ఆర్ నారాయణమూర్తి లాంటి వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఇంకా ఎక్కువగా అలోచించి మాట్లాడాలి, ఫోన్ చేతిలో ఉంది కదా, అందులో నెట్ బాలన్స్ ఉంది కదా అని ఏది తోస్తే అది మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది.