మహేష్ సినిమాలో కీలక పాత్రలో పవన్ కల్యాణ్

పవర్ స్టార్, సూపర్ స్టార్ కలిసి నటించనున్నారా?.. అంటే అవుననే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తుండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాట సినిమాలో నటిస్తున్నాడు. వీరిద్దరు మరి కలిసి ఎలా నటిస్తారని అనుకుంటున్నారా?.. అవును. సర్కారువారి పాట సినిమాలో పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించనున్నాడట.

pawankalyan

పవన్ పాత్ర 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంటుందని, ఇది సినిమాలో ముఖ్యమైన పాత్ర అని ప్రచారం జరుగుతోంది. పవన్ పాత్ర కథను మలుపు తిప్పుతుందట. పవన్, మహేష్ బాబు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో మహేష్ నటించిన ‘అర్జున్’ సినిమా పైరసీ విషయంలో పవన్ సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత పవన్ నటించిన ‘జల్సా’ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇలా ఇరువురు సపోర్ట్ చేసుకోవడాన్ని బట్టి చూస్తూంటే పవన్, మహేష్ మధ్య మంచి అనుబంధం ఉందని అర్థమవుతోంది.

దీంతో మహేష్ సినిమాలో పవన్ నటిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్ హైలెట్‌గా నిలవనుంది. బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే ఆర్థిక మోసగాళ్లకు సంబంధించిన కథతో సర్కారువారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బ్యాంక్ మేనేజర్ పాత్రలో మహేష్ నటిస్తున్నాడు. పరుశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.