పవన్ ప్రొడ్యూసర్, త్రివిక్రమ్ డైరెక్టర్, చరణ్ హీరో…

ప‌వ‌న్ ప్రొడ్యూస‌ర్‌గా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సినిమా రానుందా? ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్‌లో హాట్ టాపిక్ ఇదే. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో నితిన్ హీరోగా సినిమా వచ్చింది, ఈ సినిమా అయిపోయాక పవన్ బ్యానర్ లో మళ్లీ సినిమా రాలేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మించే చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తార‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. బాబాయ్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తోనూ, అబ్బాయి చరణ్ నిర్మాణంలోనూ, న‌ట‌న‌లోనూ బిజీ బిజీ. అందుకే ఎవ‌రూ ఆ టాపిక్ తీసుకుని రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఆ టాపిక్ మ‌ళ్లీ చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన త్రివిక్ర‌మ్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ టాపిక్ తెచ్చిన‌ట్టు వినికిడి. చ‌ర‌ణ్‌ని దృష్టిలో పెట్టుకుని మంచి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ బ‌న్నీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాక చ‌ర‌ణ్ కోసం స్టోరీ ప్రిపేర్ చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు చ‌ర‌ణ్ కూడా ఆర్ ఆర్ ఆర్‌తో బిజీగా ఉంటార‌న్న‌మాట‌. 2020కి అంద‌రూ త‌మ ప్రాజెక్టుల‌ను ఫుల్‌పిల్ చేసుకుంటారు. అప్పుడు ఈ న‌యా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టొచ్చ‌న్నది టాక్‌. మ‌రోవైపు ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో సినిమా చేయ‌వ‌చ్చ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ లో త్రివిక్రమ్ ఏ సినిమా చేస్తాడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ హీరో అనే మాటే మెగా అభిమానులని ఖుషి చేస్తోంది.