

హిందూధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి హిందువూ ఈ ధర్మాన్ని ఆచరించేలా చేసేందుకు తెలుగు నుంచి మరో భక్తి ఛానల్ ఆవిర్భవిస్తోంది. మహా టివి న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ‘మహా భక్తి’టివి రాబోతోంది. ఈ బుధవారం రోజున ప్రారంభం కాబోతోన్న ఈ మహాభక్తి ఛానల్ లోగోను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహా న్యూస్ ఎమ్.డి వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఆ భగవంతుడు ఆదేశించారు. ఈ మహా వంశీ పాటిస్తున్నారు. మహా కుంభమేళా ఆఖరి రోజున, మహా శివరాత్రి పర్వదినాన, మహాశివ జాగరణ సమయంలో, మహా రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తూ, మహాలింగోద్భవ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, మహా శివపార్వతుల కళ్యాణంతో పాటు ‘మహా భక్తి’ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి, శుభ ప్రారంభానికి విచ్చేసినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రావడం .. మహా గ్రూప్ చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యఫలం. మహా గ్రూప్ నుంచి మహా న్యూస్, మహా మ్యాక్స్ అనే రెండు ఛానల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు మహా భక్తి పేరుతో మూడో ఛానల్ ఆవిష్కరణ జరుగుతోంది. ఈ మహాభక్తి ఛానల్ ని సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తూ.. అందరూ బావుండాలి అందులో నేనుండాలి అనే లక్ష్యంతో నడుస్తూ నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, ఆలోచనలను ఈ మహాభక్తి ఛానల్ ఎల్లవేళలా ముందుకు తీసుకువెళతామని తెలియజేస్తున్నాం..’ అన్నారు.
లోగో ఆవిష్కర్త పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘మహాభక్తి ఛానల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన వంశీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి రావడానికి నేను సరైన వ్యక్తిని కాదని నా భావన. మఠాధిపతుల్లాగా నేను మాట్లాడలేను. హైందవ ధర్మాన్ని పాటించే సగటు వ్యక్తిగా, హైందవ ధర్మాన్ని దిగజార్చి మాట్లాడుతున్న దాన్ని వ్యతిరేకించే వాయిస్ ఉండాలని కోరుకుంటాం. ప్రసార మాధ్యమాల్లో హైందర ధర్మాన్ని కించపరిచేలాగా, రకరకాల వ్యాఖ్యలు ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టి, ధర్మం పక్షాన మాట్లాడే ప్రసార మాధ్యమాలు తక్కువ. కేవలం వ్యాపారం కోసం కాకుండా హైందవ ధర్మం కోసం గళం విప్పాలి అని మహాభక్తి ఛానల్ ప్రారంభించిన వంశీ గారికి ధన్యవాదాలు చెబుతున్నా. మన చరిత్ర స్కూల్స్ లో నేర్చుకున్నాం కానీ.. మన ధర్మం గురించి ఎవరూ చెప్పలేదు. ఎంత సేపు అక్కడ ఓడిపోయాం. మొఘల్స్ వచ్చి కొట్టారు. బ్రిటీష్ వాళ్లు కొట్టారు అని తప్ప మన చరిత్ర గొప్పతనాన్ని సనాతన ధర్మాన్ని పాటించిన పాలకులు ఎంత గొప్పగా చేశారో.. అన్ని మతాలను ఎలా ఆదించారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మధుర మీనాక్షి టెంపుల్ కు వెళితే.. విదేశీ రాజులు వచ్చినప్పుడు మీనాక్షమ్మ మూలవిగ్రహాన్ని ఎలా కాపాడుకున్నారు.. అని అడిగితే.. ఒక శివలింగాన్ని చూపించారట. సెక్యులరిజం పేరుతో అన్ని మతాలూ సమానం చెప్పిన హిందూధర్మాన్ని అందరూ హేళన చేస్తున్నప్పుడు నాకు ఇబ్బంది అనిపించింది. నేనేమీ మూర్ఖంగా పట్టుపట్టే హిందువును కాదు. దీనివల్ల ఓట్లు వస్తాయా పోతాయా అనేది తెలియదు. కానీ అన్ని మతాలు బావుండాలని చెప్పిన నా ధర్మంపై పదే పదే దాడి చేస్తున్నప్పుడు.. ఏ దేవుడైతే ఉనికినిచ్చాడో, ఏ పరమాత్మ అయితే ఈ స్థానం ఇచ్చాడో.. ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం. ఇతర మతాలపై దాడి జరిగినప్పుడు అందరూ వెనకేసుకు వస్తారు. కానీ హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ఎవరూ మాట్లాడరు.. ఎందుకంటే ఓట్లు పోతాయంటారు. దీనిమీద లోతుగా డిబేట్ జరగాలి. చరిత్ర గురించి మాట్లాడాలి. ఊర్మిళ థాపర్ లాంటి వాళ్లు మన చరిత్ర ఇతిహాసాలను చంపేశారు. రామాయణం, భారతం మన చరిత్ర. ప్రతిదానికీ రుజువులు ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం గురించి ఆస్ట్రాలజికల్ గా ప్రూవ్ చేయడం చదివి ఆశ్చర్యపోయాను. అన్నిటికీ సాక్ష్యాధారాలున్నాయి. రాముడు ఏ టైమ్ లో పుట్టాడు అనేది సైంటిఫిక్ డేటాతో సహా ఉంది. ఇలాంటి వాటిని వెటకారాలు చేసేవాళ్లు, కించపరిచేవాళ్లను చూస్తే ఇబ్బంది అనిపిస్తుంది. నాకు ఓట్లు రాకపోయినా ఫర్వాలేదు. కానీ నా ధర్మాన్ని కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే. హైందవ సమాజాన్ని పరిరక్షించే దిశలో ఈ ఛానల్ ఉండాలని కోరుకుంటున్నా. మొండిగా, మూర్ఖంగా డిబేట్స్ ఉండాలని కోరుకోవడం లేదు. మూర్ఖ భక్తి కూడా మంచిది కాదు. హేతు బద్ధత లేని భక్తి కూడా మంచిది కాదు. హైందవ ధర్మం నిత్యనూతనంగా ఆవిష్కరింప చేసుకునే ధర్మం సనాతన ధర్మం. ఇదంతా రాబోయే తరాలకు చరిత్ర రూపంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ఛానల్ కృషి చేయాలని కోరుకుంటున్నాను. బ్రిటీష్ మెకాలే దగ్గర నుంచి ఊర్మిళ థాపర్ లాంటి వాళ్లు మనల్ని కండీషన్ చేస్తూ వచ్చారు. చరిత్రకారులు ఎన్నో వక్రీకరణలు చేశారు. మనకూ ఉత్తర భారతానికి సంబంధం లేదు అని పిచ్చి ఐడియాలజీ లాంటి అన్నిటినీ కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. బలమైన సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలి. వంశీ గారి నాయకత్వంలో ఈ భక్తి ఛానల్ కూడా విజయవంతం కావాలని.. తెలుగు ప్రజలంతా ఈ ఛానల్ ను ఆదరించాలని కోరుకుంటున్నాను.. ’’ అన్నారు.