OTTలో ‘మాస్టర్’ సినిమా రిలీజ్

చిన్న హీరోలే కాదు.. స్టార్ హీరోలు కూడా ఓటీటీలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ హీరోల నుంచి టాలీవుడ్, కోలీవుడ్ హీరోల వరకు ప్రతిఒక్కరూ ఓటీటీల బాట పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమా హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ హీరో నాగార్జున హీరోగా నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

MASTER

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్టర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మాస్టర్ సినిమా విడుదల కానుందట. ఈ మేరకు మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్‌తో విజయ్ ఫ్యాన్స్‌ షాక్‌కి గురవుతున్నారు.

అయితే మరికొందరు మాత్రం అమెజాన్ ప్రైమ్‌తో మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారని, థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం థియేటర్ల ఆక్యూపెన్సీ పెంచితే థియేటర్లలో విడుదల చేయాలని మాస్టర్ యూనిట్ భావిస్తుందట. ఒకవేళ ప్రభుత్వం ఆక్యూపెన్సీ పెంచకపోతే ఓటీటీలోనే విడుదల చేసే అవకాశముంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.