
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూటు మార్చి తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించింది. సినిమా చూసిని ప్రతి ప్రేక్షకుడూ డివైన్ ఫీల్‌తో బయటకు వచ్చి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో డివైన్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
నిర్మాత మధు మాట్లాడుతూ..‘‘ఓదెల-2’లో యాక్ట్ చేసిన నటీనటులందరికీ ధన్యవాదాలు. సంపతి నంది గారు, నేను కలిసి ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నాం. అనుకున్నట్లుగానే మంచి భక్తిభావం ఉన్న సినిమాను తీశాం. ఈ సినిమా ద్వారా కాశీని చూశాం. మహాకుంభమేళాలో టీజర్ లాంచ్ చేశాం. ఈ సినిమా ద్వారా నా లైఫ్‌లో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. ఈ సినిమా గురించి కొన్ని రివ్యూస్ చూసి నా చాలా ఆశ్చర్యపోయా. ప్రేక్షకులంతా సినిమా బాగుందని అంటుంటే.. రివ్యూయర్స్ కొంతమంది మాత్రం నెగిటివ్‌గా రాశారు. అది మంచి పద్ధతి కాదు. ఈ రివ్యూస్ ఏంటో.. ఈ సినిమా ప్రపంచం ఏంటో నాకు కొత్తగా అనిపిస్తోంది. రివ్యూయర్స్ కంటే ప్రేక్షకుల ఫీలింగ్ మాకు ముఖ్యం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్తున్నారు. అందుకే అందరూ థియేటర్‌కు వచ్చి డివైన్ ఫీల్‌ను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ..‘‘సినిమా బాగుంటేనే కలెక్షన్స్ పెరుగుతాయి. సినిమా బాగుంటేనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అది మా ఓదెల-2కి జరుగుతోంది. రివ్యూస్ అనేది ఒకరి అభిప్రాయం. కానీ మేము సినిమా తీసింది అందరికోసం. కచ్చితంగా చూడండి. అందరికీ నచ్చుతుంది.’’ అని చెప్పారు.
నటుడు వశిష్ట ఎన్ సింహ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడున్న ‘ఓదెల-2’ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. అందరికీ మంచి జరగాలి అని కోరుకునే సభ్యులున్న ఫ్యామిలీ ఇది. సంపత్ నంది గారు లేకపోతే ఈ జర్నీ ఇలా ఉండేది కాదు. మనం ఇక్కడ ఎంత మాట్లాడినా.. మన సినిమా థియేటర్‌లో మాట్లాడుతోంది. మన సినిమాలో ఉన్నట్లు దేవుడి శక్తి తెలియాలంటే దుష్టశక్తి గురించి కూడా తెలియాలి. ఈ రివ్యూస్ లాంటి నెగిటివిటీ కూడా అలాంటిదే. వీలైతే మంచిని పంచాలని కానీ.. చెడును స్ప్రెడ్ చేయకూడదు. క్లైమాక్స్‌లో శివుడి దర్శనం జరిగేటప్పుడు ఆడియన్స్ దేవుడికి దండం పెడుతున్నారు. సినిమా వాళ్లకు నచ్చకపోతే అలా చేయరు. నిజంగా ఇది గొప్ప సినిమా. అందుకే రోజురోజుకూ ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాల వల్లే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు కలెక్షన్స్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.
ఓదెల-2 క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ..‘‘ఏడాదిన్నర క్రితం ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకూ ఏదో జరిగింది. ప్రతి మూమెంట్ ఏదీ మేము ప్లాన్ చేసింది కాదు. దానంతట అదే జరిగిపోయింది. ఆ పరమ శివుడు లేకుండా ఈ సినిమా ఐడియా లేదు. ఈ సినిమా ఐడియా చెప్పగానే నిర్మాత మధు గారు దేనికీ వెనకాడకుండా చేద్దామన్నారు. అజనీష్ గారు ఇచ్చిన మ్యూజిక్‌కి గూస్‌బంప్స్ వచ్చాయి. డీఓపీ సౌందర్ రాజన్‌తో పదేళ్ల పాటు పని చేస్తున్నా. ఆయన లేకుండా ఏ సినిమా చేయలేదు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ చాలా అద్భుతంగా సెట్స్ వేసి ఇచ్చారు. ఎడిటర్ అవినాష్ వాన పాట కట్ నుంచి నాకు తెలుసు. వీళ్లందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు పేరు పేరున థ్యాంక్స్.
యాక్టర్స్ విషయానికి వస్తే.. ఓదెల-2 అనుకోగానే తమన్నాను అనుకున్నాం. 20 ఏళ్ల తన కెరీర్ ఒకవైపు.. ఇందులో ఆమె క్యారెక్టర్ ఇంకోవైపు అని చెబుతున్నారు. దానికి అంత అద్భుతమైన నటన ఇచ్చిన తమన్నాకు, ఆమె టీమ్‌కు థ్యాంక్స్. తర్వాత వశిష్ట గారు నన్ను ఫ్యామిలీ అనుకుంటారు. ఆయన ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారో తెలీదు కానీ.. ఈ సినిమా తర్వాత ఆయనకు అద్భుతమైన పాత్రలు వస్తాయి. తెలుగు సినిమా ఆయనను నెత్తిన పెట్టుకోవడం ఖాయం. సమాధి శిక్ష సీన్స్ అంత బాగా పండడానికి కారణం గగన్. ప్రభావతి గారికి నేను ఫ్యాన్. ఆమె లేకుండా సినిమాలు చేయను. ఆమెకు చెప్పాల్సిన పని లేకుండా పాత్రకు న్యాయం చేస్తారు. మిగతా ఆర్టిస్టులంతా వాళ్ల పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారికి థ్యాంక్స్.
బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు..‘మనం ఎదిగామని మనమే చెప్పుకోవాలి. మన గురించి ఎవరూ చెప్పారు’ అని అనేవారు. ఇప్పటి వరకు ఎప్పుడూ నేను నా గురించి గొప్పగా చెప్పుకోలేదు. ఈ సినిమా గురించి మాత్రం నేను చెప్పదలచుకున్నా. నాకు నాలుగైదేళ్ల క్రితం వరకు భక్తిభావం పెద్దగా లేదు. కష్టపడితేనే ప్రతిఫలం వస్తుందని నమ్మేవాడిని. అలాంటి నేను ఈ సినిమా కథ రాశానంటే ఆ పరమశివుడే నాతో రాయించాడు. ఇది నాకు సాధ్యమయ్యే కథ కాదు. ఈ సినిమా కోసం రీసెర్చ్ చేసి ప్రతిదీ తెలుసుకుని రాశాను. నంది, శివుడు కనిపించినప్పుడు వాళ్లు ఫీల్ అయిన దాన్ని నాకు ఫోన్ చేసి చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఊరి వాళ్లు ఫోన్ చేసి ప్రౌడ్ ఆఫ్ ఓదెల అని చెబుతుంటే అద్భుతంగా భావిస్తున్నా. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉండిపోయే సినిమా. మనం ఏ జోనర్ సినిమా చేసినా వంద పోలికలు ఉంటాయి. పోలికలు లేకుండా సినిమా ఉందని నేను చెప్పను. కానీ ఇందులో సమాధిశిక్ష, సైకిల్, తిరుపతి, క్లైమాక్స్‌లో ఉన్న 20 నిమిషాల గురించి అందరూ స్పెషల్‌గా మాట్లాడుతున్నారు. వీటిని అందరూ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. సినిమాలో ఉన్న మంచిని మాత్రమే స్ప్రెడ్ చేయండి. ఈ సినిమా బడ్జెట్ మీరు అనుకున్న బడ్జెట్ కాదు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. మాకు ప్రేక్షకుల రూపంలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ పరమాత్ముడు ఇచ్చే ప్రసాదంగా భావిస్తాం. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ బాటలో వెళ్తోంది. అందుకు ముఖ్య కారణం సీజీ కూడా. చాలా తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన సీజీ చేశారు. దీనికి కారణం ప్రసాద్ ల్యాబ్స్. వాళ్లందరికీ థ్యాంక్స్. సినిమా చూడని వాళ్లు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూస్తారని, ఆ శివ దర్శనాన్ని దర్శించుకుని ధన్యులవుతారని భావిస్తూ థ్యాంక్యూ సోమచ్’’ అని తెలిపారు.
ఈ సక్సెస్ మీట్‌లో ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్, ఫైట్ మాస్టర్ వెంకట్, ఎడిటర్ అవినాష్, ఆర్టిస్ట్ గగన్, డిస్ట్రిబ్యూటర్స్ శంకర్, సురేష్, నటి పూజ, విషిత, శ్రీధర్ రెడ్డి, బేబీ ఫేం ప్రభావతి, సిరి, నవీన్, ప్రియ తదితరులు పాల్గొన్నారు.