యన్టీఆర్ శతజయంతి ఉత్సవం- ఓ ప్రపంచ రికార్డ్!

గిన్నిస్ బుక్ లోకి ఎక్కే అవకాశం!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు యన్.టి.రామారావు శతజయంతి ఉత్సవాలు మే
28న ముగిసినా, ఇప్పటికీ దేశవిదేశాల్లో ఏదో రూపేణా యన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని
వేడుకలు సాగుతూ ఉండడం విశేషం! గత సంవత్సరం మే 28న ఆరంభమైన యన్టీఆర్ శతజయంతి
ఉత్సవం ఈ యేడాది మే 28 దాకా సాగింది. ఈ సంవత్సరకాలంలో యన్టీఆర్ పై అభిమానంతో
ఎందరెందరో ఎన్నెన్నో పుస్తకాలు, చిత్రపటాలు విడుదల చేసి ఆనందించారు. అలా అగణితంగా సాగిన
యన్టీఆర్ శతజయంతి ప్రస్థానంలో మరపురానిది, భావితరాలు సైతం మరచిపోలేని విధంగా తెనాలిలో
యన్టీఆర్ చిత్రప్రదర్శన సాగింది. గత సంవత్సరం మే 28 నుండి ఈ యేడాది మే 28 దాకా యన్టీఆర్
నటించిన 265 చిత్రాలను ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రతివారం ఐదు చిత్రాలు, శని, ఆదివారాల్లో యన్టీఆర్
సినీ, రాజకీయ జీవితాలపై సదస్సులు, మొత్తం వారంలో ఏడు రోజులు రోజుకొక కళాకారునికి సన్మానం
జరిగింది. అలా ఒక్క రోజు కూడా కుంటుపడకుండా ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించి ప్రపంచ
చరిత్రలో ఓ అరుదైన అధ్యాయాన్ని లిఖించారు. ఈ అరుదైన ఘనతకు కర్త, కర్మ, క్రియ అనదగ్గవారు
ముగ్గురు- మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రముఖ రచయిత డాక్టర్ బుర్రా సాయిమాధవ్,
యన్టీఆర్ వీరాభిమాని, నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు. ఈ ఘనత వెనుక వారి కృషి, దీక్ష,
పట్టుదల ఎలాంటిదో ‘నవ్య’ పాఠకుల కోసం-

ప్రపంచంలో ఎక్కడా జరగలేదు- ఆలపాటి రాజేంద్రప్రసాద్

“ఒక సంవత్సరం పాటు ఒక్క రోజు కూడా కుంటుపడకుండా శతజయంతి ఉత్సవం నిర్వహించడం
నిజంగా ఓ చరిత్ర! యన్టీఆర్ వల్లే తెలుగునేలపై రాజకీయ చైతన్యం వచ్చింది. అలా చైతన్యవంతులుగా
మారిన వారిలో నేనూ ఒకరిని. ఆయన నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయాల్లో
రాణించాను. అందువల్ల యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని
భావించాను. అయితే ఎలా చేయాలో తెలియదు. ఏదో ప్రణాళిక రూపొందించాం. అదే సమయంలో బుర్రా
సాయిమాధవ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు నన్ను కలసి, యేడాది పాటు అభిమానులకు ఉచితంగా
సినిమాలు ప్రదర్శించాలన్న సంకల్పం వివరించారు. అన్ని సినిమాలు ఎలా సేకరిస్తారు అన్న
అనుమానం కలిగింది. కానీ, వారిద్దరూ వాటిని సాధిస్తాం అన్నారు. చేసి చూపించారు. పైనున్న
పెద్దాయన ఆశీర్వాదబలంతో ఏ ఆటంకమూ కలుగకుండా శతజయంతి సాగింది” అని ఆలపాటి రాజేంద్ర
ప్రసాద్ తెలిపారు.

యన్టీఆర్ అంటే ప్రాణం – బుర్రా సాయిమాధవ్

“యన్టీఆర్ నటించిన సినిమాలను ఏడాది పాటు ప్రదర్శించాలన్న ఆలోచన మిత్రులు కొమ్మినేని
వెంకటేశ్వరరావుది. మా స్వస్థలం తెనాలి. మా నాన్న ప్రఖ్యాత రంగస్థల నటులు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి.
ఆయన పేరున నేను ప్రతి యేటా ‘వీణా అవార్డుల పేరిట’ రంగస్థల అవార్డుల ప్రదానకార్యక్రమం
నిర్వహిస్తూ ఉంటాను. ఓ సారి కొమ్మినేని కూడా వచ్చారు. అక్కడ నిర్వహణ చూసినప్పుడే, ఆయన
నాతో యన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలన్న ఆలోచన గురించి చెప్పారు. నేను
యన్టీఆర్ వీరాభిమానిని. ఆయన కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. అందువల్ల మరోమాట లేకుండా
సరే అన్నాను” అని బుర్రా సాయిమాధవ్ అన్నారు. తాను చదువుకొనే రోజుల్లోనే యన్టీఆర్ కు
వీరాభిమానినని, అందుకు తాను చదువుకున్న పాఠ్యాంశాల్లోని పాత్రల్లో యన్టీఆర్ తెరపై జీవించడమే
కారణమని సాయిమాధవ్ వివరించారు. పుస్తకాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ భీష్మ ఇలా ఎన్నెన్నో పాఠ్యాంశాలు
చదివేవారమని, ఆ గాథలను తెరపై యన్టీఆర్ అభినయంతో చూసే భాగ్యం కలిగిందని, అప్పట్లో
దేవుడంటే మాకు యన్టీఆరే గుర్తుకు వచ్చేవారని సాయిమాధవ్ అన్నారు. అంతటి సమ్మోహన శక్తి
కలిగిన యన్టీఆర్ ను తనలాగే కోట్లాది మంది ఆరాధిస్తున్నారని అలాంటి వారికోసం రామారావు
చిత్రాలను ప్రదర్శించడం ఓ భాగ్యంగా భావించానని వివరించారు. ప్రతి నెల చివరి శనివారం రంగస్థల
ప్రముఖులకు సన్మానంతో పాటు యన్టీఆర్ రంగస్థల అవార్డు, పదివేల నగదు బహుమానం
అందించామని, చివరి ఆదివారం యన్టీఆర్ తో అనుబంధం ఉన్న సినీప్రముఖుల్లో ఒకరికి సన్మానంతో
పాటు యన్టీఆర్ చలనచిత్ర అవార్డు, బంగారు పతకం అందించామని చెప్పారు. కె.రాఘవేంద్రరావు,
జయసుధ, జయప్రద,జయచిత్ర, ప్రభ, రాజశ్రీ, భారతీవిష్ణువర్ధన్, రాజేంద్రప్రసాద్, అశ్వనీదత్,
మురళీమోహన్ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారని వివరించారు. ఘంటసాల,
సావిత్రి, బి.నాగిరెడ్డి, పీతాంబరంలకు యన్టీఆర్ జీవితంలో ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా వారి వారసులను
సన్మానించడం అందరి అభినందనలూ అందుకుందని ఆయన భావించారు. ఈ యన్టీఆర్ అవార్డును
అందుకోవడానికి యాభై సంవత్సరాల తరువాత ఎనభై ఏళ్ళ వయసులో ప్రఖ్యాత నటి ఎల్.విజయలక్ష్మి
అమెరికా నుండి ఒంటరిగా రావడం అన్నగారి అభిమానులందరి అభినందనలూ అందుకుందని
సాయిమాధవ్ వివరించారు.”ఈ కార్యక్రమాలలో యన్టీఆర్ దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులు, ఆయనతో
కలసి నడచిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి రాజకీయనాయకులు పాల్గొనడం విశేషం.
ప్రతినెల యన్టీఆర్ కుటుంబ సభ్యులు విచ్చేసి వారి చేతుల మీదుగా అందరినీ సన్మానించడం ఓ ప్రత్యేక
ఆకర్షణగా నిలచింది” అని సాయిమాధవ్ తెలిపారు. చలనచిత్ర అవార్డు గ్రహీతలందరూ థియేటర్లో ఎన్టీఆర్ చిత్రాల ప్రదర్శనకు కూడా హాజరై తాము ఎన్టీఆర్ తో కలిసి నటించిన చిత్రాలను చూశారు. “ఇలా ప్రేక్షకులతో కలిసి ఆనాటి చిత్రాలను ఇప్పుడు చూడటం వారికి, వారితో పాటు ప్రేక్షకులకు కూడా అపూర్వ అనుభూతి కలిగించిందని అందరూ చెప్పడం తమకు ఎంతో ఆనందం కలిగించింది” అని కూడా సాయిమాధవ్ చెప్పారు.

అది చాలు ఈ జన్మకు… – కొమ్మినేని వెంకటేశ్వరరావు

“మాకు తెలిసి ప్రపంచంలోనే ఏ నటునికీ జరగని విధంగా యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను
నిర్వహించగలిగాం. యన్టీఆర్ అభిమానిగా జన్మించడమే ఓ అదృష్టంగా భావించే మాకు ఈ శతజయంతి
ఉత్సవాల నిర్వహణయే చాలు ఈ జన్మకు” అంటూ తన వీరాభిమానాన్ని ప్రదర్శించారు కొమ్మినేని
వెంకటేశ్వరరావు. యన్టీఆర్ మొత్తం 302 చిత్రాలలో నటించగా, వాటిలో 280 తెలుగు సినిమాలు.
అందులో 265 చిత్రాలను సంపాదించగలిగామని కొమ్మినేని చెప్పారు. అందుకోసం 2021లోనే ఓ
ప్రణాళిక ప్రారంభించామని, అప్పటి నుంచీ యన్టీఆర్ చిత్రాలను సేకరిస్తూ వచ్చామని, వాటిలో సరిగా
లేని ప్రింట్లను డిజిటలైజ్ చేయించి మరీ నవతరం ప్రేక్షకులకు ప్రదర్శించామని, అందుకోసం ఓ స్పెషల్
ప్రొజెక్టర్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. తెనాలిలో ఒకప్పుడు యన్టీఆర్ నిర్మించి, తరువాత
అమ్మేసిన రామకృష్ణ థియేటర్ ప్రస్తుతం పెమ్మసాని రామకృష్ణ థియేటర్ గా చెలామణీ అవుతోందని,
తమ సంకల్పం వారికి వివరించగానే థియేటర్ యాజమాన్యం కూడా ఆనందంగా ముందుకు వచ్చిందని
ఆయన తెలిపారు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలోనే యన్టీఆర్ ఓ అరుదైన
అధ్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో తొలిసారి వంద సినిమాలు, రెండు వందల
చిత్రాలు పూర్తి చేసుకన్న నటుడు యన్టీఆర్ అని, తెలుగులో మూడు వందల చిత్రాలు చూసిన తొలి
నటుడు కూడా ఆయనేనని అలాంటి అరుదైన వ్యక్తి శతజయంతి ఉత్సవం ఓ ప్రత్యేకతను
సంతరించుకోవాలన్న సంకల్పంతోనే 265 చిత్రాలు సేకరించగలిగామని ఆయన తెలిపారు. ‘యన్టీఆర్
కంటే ఎక్కువ చిత్రాల్లో నటించిన నలుగురు హీరోలు ఉన్నారు. కానీ, వారందరూ ఎన్ని సినిమాలు
చేసినా, రామారావు స్థాయిలో వారి చిత్రాలు లభ్యం కావడం లేదు. ఇతరులవి సగం సినిమాలు కూడా,
అంటే 200 లోపు సినిమాలు కూడా ఎవరివీ దొరకడం లేదు. యన్టీఆర్ వి మాత్రం 95 శాతం సినిమాలు
లభించడం ఓ అద్భుతం! అందుకు కారణం, యన్టీఆర్ సినిమాలకు ఉన్న రిపీట్ రన్ క్రేజ్ అని
చెప్పవచ్చు. అందువల్లే ఇన్ని సినిమాలు సేకరించగలిగామని’ ఆయన వివరించారు. ఈ ప్రత్యేకతను
ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ విధంగా ప్లాన్ చేశామని, అందుకే ఈ అంశాన్ని ‘గిన్నిస్ బుక్ ఆఫ్
వరల్డ్ రికార్డ్స్’ నమోదు చేయించడానికి పంపించామని, తప్పకుండా గిన్నిస్ రికార్డ్ నమోదు చేస్తుందని
ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంతటి అరుదైన అంశం చరిత్రలో చోటు చేసుకోవడం మరపురాని అంశమని ఈ ముగ్గురు అంటున్నారు.
అందులో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెలలోనే గ్రాండ్ ఫినాలే ఫంక్షన్ భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని చెప్పారు.

“విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా జేజేలు అందుకున్న యన్టీఆర్ కు ‘భారతరత్న’ అడగక్కర్లేదు.
ఆయన ‘ప్రపంచరత్న” అని యన్టీఆర్ శతజయంతి ఉత్సవంలో యన్టీఆర్ సినీ అవార్డు అందుకున్న
ప్రఖ్యాత దర్శకులు కె.రాఘవేంద్రరావు అన్నారు.

“నా సినీ, వ్యక్తిగత జీవితాలు రెండూ యన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొనే రూపుదిద్దుకున్నాయి. నాకు
లభించిన కీర్తి మొత్తం ఆయన వల్లనే లభించిందని భావిస్తాను. అందుకే యన్టీఆర్ శతజయంతి అవార్డు
అందుకోవడానికి అమెరికా నుండి ఈ వయసులో కూడా ఇక్కడకు వచ్చాను” అని మరో యన్టీఆర్ సినీ
అవార్డు గ్రహీత ఎల్. విజయలక్ష్మి చెప్పారు.

“యన్టీఆర్ గారి సినీపర్వంలో కలర్ అధ్యాయం మొదలయ్యాక ఆయనతో ఎక్కువ చిత్రాలలో నటించే
అదృష్టం నాకు కలిగింది. యన్టీఆర్ చివరి సినిమాగా విడుదలైన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లో
ఆయనతో నటించే భాగ్యమూ నాకే దక్కింది. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా జరిగిన ఈ వేడుకల్లో
ఆయన అవార్డు అందుకోవడం ఓ మధురానుభూతి” అని ప్రముఖ
నటి జయసుధ తెలిపారు.

“నేను చిన్నతనం నుంచీ యన్టీఆర్ అభిమానిని. ఆయన ‘నర్తనశాల’ చూసిన తరువాతే నాట్యంపై ఇష్టం
పెంచుకున్నాను. యన్టీఆర్ గారితో నటించిన తొలీ సినిమా ‘అడవిరాముడు’తోనే స్టార్ హీరోయిన్
అనిపించుకున్నాను. యన్టీఆర్ గారు స్థాపించిన ‘తెలుగుదేశం పార్టీ’ తోనే నా రాజకీయ జీవితం
మొదలయింది. ఇలా ఎలా చూసినా, యన్టీఆర్ గారితో విడదీయరాని బంధం నాది. ప్రపంచంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన యన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో అవార్డు అందుకోవడం అన్నిటినీ మించి ఆనందం కలిగించింది” అని ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు.