‘నిశ్శబ్దం’ సినిమాను 2013లోనే తీయాలనుకున్నా: డైరెక్టర్ హేమంత్!!

అక్టోబర్ 2న అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అనుష్కతో పాటు అంజలి, మాధవన్, మైఖేల్ మాడ్సెన్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక దర్శకుడు హేమంత్ ఈ చిత్రం ఫైనల్ గా విడుదలవుతున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పుడు మొత్తం యూనిట్ చాలా కలత చెందింది. మేము అనుకున్నట్లుగా ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. థియేటర్స్ లోనే సినిమాను విడుదల చేయాలని ఆశతో నాలుగు నెలల వరకు వెయిట్ చేశాము. కానీ కుదరదని అర్ధమయ్యింది. చివరకు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడబోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది,

నేను ఈ సినిమాను 2013 నుంచి చేయాలని భావించాను. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రంగా ఉంటుంది. ఏదేమైనా, నిర్మాత-రచయిత కోన వెంకట్ నన్ను పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చారు. ఇక సినిమాలో ప్రతి ఒక్కరు వారి పాత్రలకు ప్రాణం పెట్టి నటించారు. అంజలి మొదటిసారి ఒక పవర్ఫుల్ పాత్రలో నటించారు. మైకేల్ కూడా తన డ్రీమ్ పాత్రలో నటించారు. ఇక మాధవన్ తన సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకోబోతున్నారు.. అంటూ హేమంత్ వివరణ ఇచ్చారు.