ఫైనల్ లెగ్ షూటింగ్ లో కళ్యాణ్ రామ్ బింబిసారా…

హీరోగా.. నిర్మాతగా టాలీవుడ్ లో తన పయనాన్ని కొనసాగిస్తున్న కల్యాణ్ రామ్ తాజాగా చారిత్రక నేపథ్య చిత్రం ‘బింబిసార’లో నటిస్తున్న విషయం తెలిసిందే. బింబిసారుడి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సైలెంట్ గా షూటింగు మొదలుపెట్టుకున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మరో 10 శాతం చిత్రీకరణ జరిగితే, షూటింగు పార్టు పూర్తయినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం ఆ కాస్త చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను, కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. యుద్ధం నేపథ్యంలో రూపొందే సినిమా కావడం వలన భారీగానే ఖర్చు చేస్తున్నారట. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల కల్యాణ్ రామ్ పూర్తి సంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా రెండు .. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం నిన్నటివరకు జరిగింది. కానీ ఈ సినిమా ఒక భాగంగానే రానుందని ఇప్పుడు వినిపిస్తోంది. ఇంతవరకూ సాంఘికాలు చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.