క్లాసికల్ సాంగ్ కి బాలీవుడ్ బ్యూటీతో చిందేస్తున్న బాలయ్య

కోలీవుడ్ లో కంగనా లీడ్ రోల్ ప్లే చేస్తున్న సినిమా తలైవి. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ఇందులో కరుణానిధిగా ప్రకాష్ రాజ్ నటిస్తుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి కనిపించనున్నాడు. జయలలిత తెలుగులో కూడా స్టార్ హీరోస్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో కూడా సినిమాలు చేసింది. అందరికన్నా ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ తోనే 12 చిత్రాలు నటించింది. వీటిలో శ్రీకృష్ణ సత్య, గండికోట రహస్యం, నిలువు దోపిడీ, కథానాయకుడు, తిక్క శంకరయ్య, చిక్కడు దొరకడు, గోపాలుడు భూపాలుడు, శ్రీకృష్ణ విజయము, దేవుడు చేసిన మనుషులు, కదలడు వదలడు, అలీ బాబా 40 మంది దొంగలు, బగ్దాద్ గజదొంగ లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అందుకే తలైవి మూవీలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ బాలయ్యకి అప్రోచ్ అయ్యారట.

నాన్న పాత్రలో మరోసారి మెప్పించడానికి బాలకృష్ణ కూడా గ్రీన్ ఇచ్చాడని సమాచారం. ఏల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న తలైవి సినిమాని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కి విష్ణు కో ప్రొడ్యూసర్ కావడం, నందమూరి కుటుంబంతో మంచి సంబంధాలు ఉండడంతో… తండ్రిలా కనిపించి మెప్పించడం కన్నా గొప్ప ఏముందని భావించే బాలకృష్ణ, ఆ కారణంతోనే తలైవి సినిమాలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడు. తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న తలైవి సినిమాలో ఎన్టీఆర్ కనిపించేది క్షణాలు మాత్రమే… ఎన్టీఆర్ జయలలిత కాంబినేషన్ లో వచ్చిన గోపాలుడు భూపాలుడు సినిమాలో కోటలోని మొనగాడా సాంగ్ చాలా ఫేమస్. ఇప్పటికీ పాత పాటలు వినే అలవాటు ఉన్న వాళ్లకి అది బాగా అలవాటైన సాంగ్. ఈ క్లాసికల్ హిట్ సాంగ్ లోనే బాలకృష్ణ, కంగనా కలిసి కనిపించే అవకాశం ఉంది.