ఆ రామయ్యకి అంకితం…

నందమూరి నట సింహం బాలకృష్ణకి తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అంటే అమితమైన ఇష్టం, ఎన్టీఆర్ ని బాలకృష్ణ దైవ సమానంగా భావిస్తారు. ఈ విషయాన్నే పబ్లిక్ గానే ఎన్నోసార్లు చెప్పిన బాలయ్య, మే 28న స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నట్టు ఆయనకు చెందిన ఎన్బీకే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా బాలకృష్ణ తాను స్వయంగా పాడిన శ్రీరామ దండకం పాటను అభిమానుల కోసం ఉదయం 9.45 నిమిషాలకు విడుదల చేయనున్నాడు. గతేడాది తన పుట్టిన రోజున బాలయ్య ‘శివశంకరీ శివానంద లహరి’ పాటని అద్భుతంగా ఆలపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ జయంతి నాడు విడుదల చేయనున్న శ్రీరామ దండకం కూడా అభిమానులని ఆకట్టుకోవడం ఖాయం. తెలుగు ప్రజలకి రాముడు అంటే అన్నగారే గుర్తొస్తారు కాబట్టి బాలయ్య ఈ రామదండకం పాడే సమయంలో ఎన్టీఆర్ రాముడిగా నటించిన విజువల్స్ ఏమైనా ఉంటాయా అనేది చూడాలి. అదే జరిగేది ఎన్టీఆర్ జయంతి నాడు బాలయ్య నందమూరి అభిమానులకి రామారావు గారిని రామయ్యగా గుర్తు చేసినట్లే అవుతుంది.

ప్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తర్వాత సినిమా ఉండనుంది. ఆపై అనిల్ రావిపూడితో సినిమా కూడా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.