బాలయ్య భలే అడిగావయ్యా…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల వివాదం ముదురుతూ ఫిల్మ్ నగర్ నుంచి న్యూస్ ఛానెల్స్ డిబేట్ రూమ్ వరకూ వెళ్ళింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ పోటి చేస్తుండడంతో అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్ ని మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తున్నా మంచు విష్ణు మాత్రం సోలో గానే రంగం లోకి దిగుతాను. సినీ పెద్దలు చెప్తే పోటి నుంచి కూడా తప్పుకుంటాను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పటివరకూ ఈ విషయం గురించి, మా ఎన్నికల వివాదం గురించి చాలా మంది బాహాటంగానే మాట్లాడినా నందమూరి బాలకృష్ణ మాత్రం సైలెంట్ గా ఉంటూ వచ్చాడు. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న బాలయ్య, ఈ విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

మంచు విష్ణు మా కార్యాలయ భవనం నిర్మాణం చేపడతాను అంటే దానికి తన మద్దతు ఉంటుంది అని చెప్పిన బాలకృష్ణ, సినీ పెద్దలంతా కలిసి వస్తే ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని చెప్పారు. కట్టబోయే దాని విషయం పక్కన పెట్టి అసలు ఇప్పటివరకూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణం ఎందుకు చేయలేదు అంటూ సూటిగా ప్రశ్నించాడు. ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ వేసుకొని మరీ అమెరికా వెళ్లి అక్కడ ఈవెంట్స్ చేసిన వాళ్లు, ఆ ఫండ్స్ ని ఏం చేశారు అంటూ క్వేషన్ చేశాడు. ఇంతే కాకుండా కొంతమంది సినిమా వాళ్లు తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు కదా, మా భవనం కోసం అడిగితే ప్రభుత్వం ఒక ఎకరం ఇవ్వదా? అని ఆయన ప్రశ్నలు సందించాడు. ఇక మా ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే విషయాన్ని పట్టించుకోనని చెప్పారు. గ్లామర్‌ ఇండిస్టీలో ఉన్న మనమంతా బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు. అసోసియేషన్‌ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు బాలకృష్ణ చెప్పారు.

బాలకృష్ణ అడిగిన ప్రశ్నల్లో నిజముంది? ఆ అమెరికా టూర్ ఫండ్స్ ఏం అయ్యాయి అనేది ఎవరికీ అంతబట్టని విషయంగా మారింది? తెలంగాణా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే కొంతమంది అడిగితే, ఇంత పెద్ద సిటీలో ప్రభుత్వం ఒక ఎకరం భూమి ఇవ్వలేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బాలకృష్ణ, ఇప్పుడు సడన్ గా బయటకి వచ్చి ఈ హాట్ కామెంట్స్ చేయడం ఏంటి అని అంతా అనుకుంటున్నారు. బాలయ్య హాట్ కామెంట్స్ చేయడం ఈరోజు కొత్తేమి కాదు, ఎపుడు ఏ విషయంపై మాట్లాడినా, ఎక్కడ తప్పు జరుగుతున్నా ఆయన దానిపై కుండ బద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని చెప్పేస్తాడు. గతంలో చిరంజీవి, నాగార్జున, కొందరు నిర్మాతలు తెలంగాణా, ఏపీ ప్రభుత్వాలని కలిసినప్పుడు కూడా భూములు అమ్ముకోవడానికి కలిసార అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అప్పట్లో ఎవరూ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు మరి ఈసారి అయినా ఆయన ప్రశ్నలకి ఎవరైనా సమాధానం ఇస్తారేమో చూడాలి.