నాగాస్త్రంకు 30 ఏళ్లు

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘నాగాస్త్రం’ సినిమా విడుదలై సరిగ్గా 30 ఏళ్లు అవుతోంది. 1990లో నవంబర్ 11వ తేదీన ఈ సినిమా విడుదలైంది. కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా.. నన్నపనేని అంకప్పచౌదరి సమర్పణలో ఎన్‌వీఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నన్నపనేని అన్నారావు ఈ సినిమాను నిర్మించారు. లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో హీరోయిన్‌గా నటించింది.

నవరసనటనా సార్వభౌమ సత్యనారాయణతో పాటు కోట శ్రీనివాసరావు, పాకేటి శివరాం, అన్నపూర్ణ, వై.విజయ, శ్రీలత, చంద్రిక లాంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. రాజసులోచన ఈ సినిమాలో అతిధి పాత్రను పోషించింది. ఇక పృద్వీరాజ్, మదన్ మోహన్, చంద్రమౌళి లాంటి నటులు పలు పాత్రల్లో నటించారు.

శాతవాహన ఈ సినిమాను కథను అందించగా.. త్రిపురనేని మహారథి మాటలు రాశారు. ప్రముఖ రచయితలైన వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమాకు పాటలు రాశారు. పి.సుశీల, ఎస్.జానకి, నాగర్ బాబు లాంటి ప్రముఖ గాయకులు ఇందులో పాటలు పాడారు. చక్రవర్తి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ఈ సినిమాలో కౌబాయ్ పాత్రలో కృష్ణ నటన ప్రేక్షకులను అబ్బురపరించింది. ఇక అచ్చ తెలుగు అమ్మాయి పాత్రలో లంగాఓణీ ధరించి ఈ సినిమాలో విజయశాంతి పోషించిన పాత్ర హైలెట్‌ అని చెప్పవచ్చు. అప్పట్లో పెద్ద విజయం సాధించిన నాగాస్త్రం సినిమాను ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. 30 సంవత్సరాలు గడిచినా ఈ సినిమాను ఇప్పటికీ అభిమానులు ఆదరిస్తున్నారంటేనే ఈ సినిమా గొప్పతనమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.