ఒళ్లు దగ్గర పెట్టుకో.. ప్రకాశ్‌రాజ్‌కి నాగబాబు వార్నింగ్

పవన్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఒక ఊసరవెల్లి అంటూ సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పవన్‌ చేస్తున్న రాజకీయాలకు సంబంధించి ప్రకాశ్‌రాజ్ చేసిన విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ప్రతి పనికిమారిన వాడు విమర్శించడమే అని ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. రాజకీయంగా నిర్ణయాలు మార్చకోవడం వెనుక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయన్నాడు. నీలాంటి వాళ్లు ఎంతవాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరని నాగబాబు బదులిచ్చాడు.

NAGABABU

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ బీజేపీకి మద్దతు ఇవ్వడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నాగబాబు స్పష్టం చేశాడు. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడని, ఓ డిబేట్‌లో సుబ్రహ్మణ్యస్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం తనకింకా గుర్తుందని ప్రకాశ్‌రాజ్‌కి నాగబాబు కౌంటరిచ్చాడు. బీజేపీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని, కానీ మంచి చేస్తే మెచ్చుకోలేని కుసంస్కారం గురించి ఏం చెప్పగలమని నాగాబాబు అన్నాడు.

దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రకాశ్ రాజ్ లాంటి మేధావులు ఎన్ని వాగినా తమ విజయాన్ని ఆపలేరన్నాడు. బీజేపీని ఎంతగా విమర్శిస్తున్నా ఆ పార్టీ ఏమీ అనడం లేదంటే ప్రజాస్వామ్యానికి బీజేపీ ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకోవాలని నాగబాబు సూచించాడు. పవన్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని ప్రకాశ్‌రాజ్‌కి నాగబాబు వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన పవన్.. గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశాడని, ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలిశాడన్నాడు. ఇలాంటప్పుడు జనసేన పార్టీ ఎందుకని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు.