పెరిగిన థియేటర్స్‌తో విజయపథంలో ‘కౌసల్య కృష్ణమూర్తి’

Kousalya Krishnamurthy

‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రానికి థియేటర్స్‌ పెరిగాయి. ఒక మంచి చిత్రంగా అందరి ఆదరాభిమానాలను పొందుతున్న ఈ సినిమాకి రెస్పాన్స్‌ బాగా వస్తున్న నేపథ్యంలో థియేటర్స్‌ పెంచారు. మౌత్‌టాక్‌తో రోజురోజుకీ ఈ సినిమాకి ఆదరణ పెరుగుతోంది. ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ‘కౌసల్య కష్ణమూర్తి ది క్రికెటర్‌’ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సినిమా ప్రేమికులనే కాదు, రాజకీయ నాయకులను, క్రీడా ప్రముఖులను కూడా అలరిస్తోంది. ఇటీవల ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి వీక్షించి యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్స్‌ పుల్లెల గోపీచంద్‌, పి.వి.సింధు కూడా ఇటీవల సినిమాను చూసి ఇంత మంచి సినిమాను అందించిన దర్శకనిర్మాతలను, అద్భుతంగా నటించిన నటీనటులను అభినందించారు.

‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రానికి పెరిగిన ఆదరణతో థియేటర్స్‌ను పెంచిన నేపథ్యంలో చిత్ర సమర్పకులు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ”మా సినిమాకి మేం ఊహించిన దానికంటే బాగా రెస్పాన్స్‌ వస్తోంది. రోజురోజుకీ ఆదరణ పెరగడంతో మేం సినిమాపై ఉంచిన నమ్మకం నిజమైంది. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్‌ అయింది. ఈ ఆదరణ ఇంకా పెరిగి మా సినిమా ఇంకా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.