మరోసారి డ్రగ్స్ వార్తలలో మోలీవుడ్

మలయాళ చిత్రపరిశ్రమ డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా మరియు వారి స్నేహితుడు షలీఫ్‌లను కొచ్చిన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
శనివారం అర్థరాత్రి దర్శకులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొద్ది మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో, ఈ ముగ్గురు వ్యక్తులు చాలా కాలంగా గంజాయి వినియోగిస్తున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. సినిమా చర్చల కోసం వీరంతా ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారని, మత్తుపదార్థాల సరఫరా గురించి లోతైన విచారణ జరుపుతున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
మోలీవుడ్‌లో వరుసగా జరుగుతున్న ఈ అరెస్టులు పరిశ్రమలో డ్రగ్స్ సమస్యపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.