ఐఫోన్ తో షూటింగ్ చేసి, ఏ ఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ‘మిషన్ మాయ’ చిత్ర పోస్టర్ లాంచ్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభవంతులను ప్రోత్సహించే విధంగా పిజె ప్రొడక్షన్స్ వారి నిర్మాణ సంస్థ ద్వారా మరొక చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2గా ప్రవీణ్ జోల్లు నిర్మాణంలో ఖుషి రావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మిషన్ మాయ. ఈ చిత్ర పోస్టర్లు రవీంద్రభారతిలో డైలాగ్ కింగ్ సాయికుమార్, నటుడు ఆలీ, మామిడి హరికృష్ణ గారి చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు అంతా కలిసి ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఐఫోన్లో తీయడం ప్రత్యేకత అయితే చిత్రానికి ఎక్కువగా ఆధునిక టెక్నాలజీ అయినటువంటి ఏఐ ను బాగా ఉపయోగించడం జరిగింది.

ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. సాధారణంగా కొత్త టెక్నాలజీలు, విఎఫ్ఎక్స్ లు వచ్చినప్పుడు తెలుగువారు వాటిని ఉపయోగించి సినిమాలు తీయడంలో ఒక అడుగు ముందే ఉంటారు. ఈ చిత్రానికి ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగించారు. అలాగే చిత్ర టైటిల్ ప్రత్యేకంగా ఉంది. ఈ చిత్రాన్ని అంతా ఐఫోన్ లో షూట్ చేయడం అనేది మరొక ప్రత్యేకత. క్రియేటివిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్న సినిమా ఇది. వచ్చే తరాలకు ఈ చిత్ర టెక్నాలజీ ఒక మార్గదర్శకంగా ఉండబోతుంది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రం రాబోతుంది. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్” అన్నారు.

దర్శకుడు ఖుషి రావు గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నా ధన్యవాదాలు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను చూసుకొని ఒక కొత్త ఐడియాతో సినిమా చేద్దామని వచ్చాను. సాధారణంగా ఎప్పుడు చేసే విధంగా సినిమా చేస్తే ఓకే కానీ నేను ఏఐ టెక్నాలజీతో, సౌండ్ ఎఫెక్ట్స్, వి ఎఫ్ ఎక్స్, మ్యూజిక్ తో వచ్చినప్పుడు అది పూర్తిగా ఒక ఎక్స్పరిమెంట్. అటువంటి ఎక్స్పరిమెంట్ చేస్తున్న సమయంలో ఈ చిత్రంలో నటించేందుకు నటీనటులు రావడం అనేది మామూలు విషయం కాదు. పెట్టిన డబ్బులు వస్తాయో లేదో తెలియదు, చేసేది ఒక ఎక్స్పరిమెంట్ అని తెలిసి కూడా మాపై నమ్మకంతో ముందుకు వచ్చిన నిర్మాతగా ప్రవీణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఐఫోన్ లో చేయడంతో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకు వెళుతుంది అనుకుంటున్నాము” అన్నారు.

నిర్మాత ప్రవీణ్ జోల్లు మాట్లాడుతూ… “ఒక ఐఫోన్ లో షూట్ చేస్తూ టెక్నాలజీ ద్వారా ఒక చిత్రాన్ని చేద్దాం అనుకున్నాము. అంతవరకు ఓకే కానీ ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రం కోసం వారు ఎంత కష్టపడ్డారో, చిత్రానికి ఎంత సపోర్టుగా నిలిచారు నాకు తెలుసు. ఈ చిత్రాన్ని చేస్తూ ఉండగా దీనిపై పెట్టిన డబ్బు గాని లేదా ఇతర అంశాలు కానీ నాకు ఏమీ గుర్తురాలేదు. కేవలం వీరందరి కోసం ఈ చిత్రం పూర్తి అవ్వాలి అని కోరుకున్నాను. అలాగే ఒక మొబైల్ ఫోన్లో అటువంటి అడవిలో ఒక సినిమా తీయడం అనేది దర్శకుడికి చాలా కష్టమైన పని. అయినా కూడా అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని పూర్తి చేశారు” అన్నారు.

సత్యనారాయణ గారు మాట్లాడుతూ… “మాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా వారు అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఒక ఐఫోన్తో సినిమా చేద్దాం అనే ఆలోచన అనుకున్నాము. ఈ చిత్రం చాలా న్యాచురల్ గా రావాలని ఉద్దేశంతో నిజంగానే ఒక అడవిలోకి వెళ్లి షూటింగ్ చేసాము. దానితో నిర్మాత మా బాగోగులు రెగ్యులర్గా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉండేవారు. ఆయన మాకు కొండంత అండగా నిలిచారు. అలాగే చిత్ర దర్శకుడు ఖుషి గారు ప్రాజెక్టు ఈ విధంగా అనుకుంటున్నామని చెప్పగానే నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ప్రతి నటీనటులను ఆడిషన్ చేసి తీసుకున్నాము” అంటూ ముగించారు.