మధుర గాయకుడు ‘బాలు’ స్మృతులే మిగిలాయి – డి .వి .కె .రాజు

పద్మశ్రీ , గాన గంధర్వుడు ఎస్ .పి బాలసుబ్రమణ్యం ఇక లేరు అన్నవార్త కోట్లాదిమంది అభిమానులను కన్నీరు పెట్టించింది .బాలు అసామాన్యుడు, అద్వితీయమైన నేపధ్య గాయకుడు , 14 భాషల్లో 40 వేల పాటలను ఆలపించిన మధుర గాయకుడు .మృదు స్వభావి , నిరాడంబరుడు , నిగర్వి ,స్నేహశీలి అయిన బాలసుబ్రమణ్యం గారితో మా కుటుంబానికి , ముఖ్యంగా మా నాన్న గారు పద్మశ్రీ డి .వి .ఎస్ రాజు గారితో ఎంతో సన్నిహిత సంబంధాలు వున్నాయి . అవి కేవలం వృత్తి పరమైనవే కాదు , వ్యక్తి గతంగా కూడా బాలు గారిని నాన్న గారు ఆత్మీయుడుగా భావించేవారు . మా డి .వి .ఎస్ సంస్థ నిర్మించిన అన్ని చిత్రాల్లో బాలు గారు పాడారు . “జీవన జ్యోతి ” చిత్రంలో బాలు పాడిన పాటకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు నిచ్చి సత్కరించింది . నాన్న గారు ఎంతో సంతోషించారు . బాలును ఆయన అభినందించారు . బాలు నిర్వహించిన “పాడుతా తియ్యగా “, “స్వరాభిషేకం” కార్యక్రమాలను నాన్నగారు క్రమం తప్పకుండా చూసేవారు . ఆ ఇద్దరినీ దగ్గరగా చూసినవాణ్ణి .నాన్నగారు పోయారని తెలిసి బాలు గారు ఎంతో బాధ పడ్డారు , వారితో తనకున్న అనుబంధం గురించి ఓ వీడియో చేసి పంపారు .ఆ ఇద్దరి స్మృతులు మా జీవితంలో ఎప్పుడూ అపురూపంగా, అనిర్వచనీయంగా ఉంటాయి .1990లో మా సంస్థ నిర్మించిన ::”దోషి- నిర్దోషి” చిత్రం పాటల రికార్డింగ్ చెన్నై ఏ వి .ఎమ్ జి థియేటర్లో జరిగినప్పుడు బాలు గారు స్వయంగా వచ్చినాన్న గారిని కలవడం నా స్మృతి పథంలో వుంది .బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ని తెలియజేస్తున్నా