స్పీడ్ పెంచనున్న చిరు… బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ షురు

2017లో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గడిచిన నాలుగేళ్లలో చేసింది రెండు సినిమాలే. అందులో సైరా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ప్రొడక్షన్ కి చాలా టైం తీసుకుంది. ఈ సినిమా సినిమాల మధ్య గ్యాప్ తొలగించాలని చూస్తున్న చిరు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని ఓకే చేశాడు. ఒకసారి చిరంజీవి లైనప్ లో ఉన్న సినిమాలు చూస్తే 2022 ఎండ్ అయ్యే లోపు మూడు సినిమాలను రిలీజ్ చేసేలా ఉన్నారు. అయితే ఇందులో ఒక్క సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. కొరటాలతో చేస్తున్న ఆచర్య మూవీ ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ లో ఉంది. ఇది వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని సెట్స్ పైకి తీసుకోని వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట చిరు.

ఈనెల 6వ తేదీ నుంచి ఆచార్య సినిమా షూటింగ్ మొదలుపెట్టి, బ్యాలెన్స్ ఉన్న 12 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్రణాళిక రచిస్తున్నారు. అంటే ఈ నెల 20 వరకు ఆచార్య కి గుమ్మడికాయ కొట్టేసి, మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ ను మొదలు పెట్టబోతున్నారట. దాదాపు కాస్టింగ్ సెలక్షన్ కూడా పూర్తయిన ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు తమన్. ఈ మూవీని సెట్స్ పై ఉండగానే, చిరు మరో సినిమాను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అది వేదాళం రీమేక్, లేదా మైత్రీ మూవీస్ నిర్మాతలుగా లేదా బాబీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా అని తెలుస్తోంది. లూసీఫర్ రీమేక్ షూటింగ్ ఆగస్టులో మొదలు పెట్టనుండగా, వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారట.