కరోనా కారణంగా మెగా అభిమాని మరణం…

మెగాస్టార్ ఐ బ్యాంక్ స్ఫూర్తితో కోన‌సీమ ఐ బ్యాంక్ ప్రారంభించిన మెగా వీరాభిమాని యర్రా నాగ‌బాబు క‌రోనాతో పోరాడి మృతి చెందారు. ఆయ‌న తూ.గో జిల్లా వాసి. కోనసీమ ఐ బ్యాంక్ ని ప్రారంభించి ఎంద‌రో అవ‌స‌రార్థుల‌కు అవ‌య‌వ దానం ప‌రంగా సాయం అందించారు. నాగ‌బాబు ఊహించ‌ని మ‌ర‌ణం షాక్ కి గురి చేసిందంటూ మెగాస్టార్ చిరంజీవి తీవ్ర‌ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ-య‌ర్రా నాగ‌బాబు నా వీరాభిమాని. అభిమానుల్లోనే గ‌ర్వ‌కార‌ణ‌మైన అభిమాని నాగ‌బాబు. ఎన్నో మంచి సామాజిక కార్య‌క్ర‌మాల‌తో గ‌ర్వ‌కార‌ణ‌మ‌య్యాడు. నా ఐ బ్యాంక్ స్ఫూర్తితో తాను కూడా కోన‌సీమ‌ ఐబ్యాంక్ ప్రారంభించి ఎంద‌రికో కంటి చూపునిచ్చాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. అత‌డు కాకినాడ ల‌క్ష్మీ ఆస్ప‌త్రిలో కరోనాకి చికిత్స పొందుతూ పోరాడి ఓడిపోయి మృతి చెందారు. ఇది చాలా బాధాక‌రం. కొద్దిరోజుల క్రితం ఆయ‌న‌తో మాట్లాడితే భరోసాగా మాట్లాడాడు. కోలుకుంటున్నాను చికిత్స బావుంది అని అన్నారు. డాక్ట‌ర్లు భ‌రోసానిచ్చారు. కానీ అనుకోకుండానే ఆయ‌న‌ను పోగొట్టుకున్నాను. వారి కుటుంబ స‌భ్యుల‌కు మాన‌సిక స్త్వైర్యాన్నివ్వాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను. సారీ నాగ‌బాబు.. ఐ మిస్ యు! అని అన్నారు.