ఆర్ ఆర్ ఆర్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్… చిత్ర యూనిట్ పై చిరంజీవి ప్రశంసలు!

హైదరాబాద్‌ : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కుగోల్డెన్‌గోల్డ్‌ అవార్డు వరించడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అందడం పట్ల అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక విజయమంటూ దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. ఈమేరకు సంగీత దర్శకుడు కీరవాణి , ఇతర చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ‘‘ఇదొక అద్భుతమైన, చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటునాటు’కి గానూ కీరవాణి గోల్డెన్‌గ్లోబ్‌ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మిల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్ ఈ రెండింటి సెలబ్రేషనే ‘నాటునాటు’. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తోంది. చరణ్ , తారక్‌ తోపాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌కు కంగ్రాట్స్‌’’ అని పేర్కొన్నారు.

‘‘కంగ్రాట్స్‌ సర్‌ జీ. నా కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో పాటలకు డ్యాన్స్‌ చేశాను. కానీ, ‘నాటు నాటు’ ఎప్పటికీ నా హృదయానికి చేరువగానే ఉంటుంది’’ – ఎన్టీఆర్‌

‘‘ఇదొక అద్భుతమైన మార్పు. భారతీయులందరూ ముఖ్యంగా మీ అభిమానుల తరఫున కీరవాణి, రాజమౌళి, చిత్రబృందం మొత్తానికి అభినందనలు’’ – ఏ ఆర్‌ రెహమాన్‌

‘‘ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న కీరవాణికి హృదయపూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’ – క్రిష్‌