‘మజాకా’ హండ్రెడ్ పర్సెంట్ హిట్ సినిమా : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

మజాకా ఎలా ఉండబోతోంది ?
-మజాకా వందశాతం హిట్ ఫిల్మ్. ఆ రేంజ్ ఏమిటనేది ఫస్ట్ షో పడ్డాక డిసైడ్ అవుతుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారంతా సూపర్ వుంది, హిట్ ఫిల్మ్ అన్నారు.

మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి  పబ్లిసిటీ టైం సరిపోలేదనిపిస్తోంది?
-టైం తక్కువైన మాట నిజమే. నిర్మాతలు వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్ పెట్టారు. శివరాత్రి రిలీజ్ చేయాలని అందరం డే అండ్ నైట్ కష్టపడ్డాం. శివరాత్రి సినిమాకి మంచి డేట్.

ఈ కథ ఎప్పుడు విన్నారు ?
-‘ధమాకా’ సమయంలోనే ప్రసన్న కుమార్ ఈ కథ చెప్పారు. రావు రమేష్ ని ద్రుష్టిలో పెట్టుకొని చెప్పారు. హీరోగా ఎవరు చేస్తారని అడిగాను. ఈ కథ కొందరి దగ్గరరికి వెళ్ళింది. ఫైనల్ గా రావు రమేష్ గారి కాంబినేషన్ లోనే వచ్చింది. నిజానికి ఈ కథని సందీప్ కిషన్ ఒప్పుకోవడం చాలా గ్రేట్.

ఈ కథకి బ్రోడాడీ స్ఫూర్తి ఉందా ?
-లేదండీ. నేను ఆ సినిమా చూశాను. ఆ కథే వేరు ఇది వేరు.  

మజాకా కథ ఏమిటి ?
-సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. ఆడదిక్కులేని ఇద్దరు మగాళ్ళ ఎప్పటికైన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలనుకునే వారి తపనే ఈ కథ. దిని కోసం వాళ్ళు పడే బాధలు, ప్రయత్నాలు ఫుల్ ఫన్ జోన్ లో వుంటాయి. చివరి ఇరవై నిముషాలు చాలా ఎమోషనల్ గా వుంటుంది.

ప్రసన్న ఈ కథ చెప్పిన తర్వాత మీరు ఎలాంటి మార్పులు చేశారు ?
– ప్రతి సినిమాకి మార్పులు చేర్పులు వుంటాయి. కానీ ఈ సినిమా వరకూ స్క్రిప్ట్ లో నేను పెద్దగా ఇన్వాల్ కాలేదు. కంప్లీట్ బైండ్ స్క్రిప్ట్ తో వచ్చారు ప్రసన్న. అప్పటికే అన్ని మార్పులు చేర్పులు చేసి సీన్స్, విత్ డైలాగ్ తో వచ్చారు. ప్రసన్న, సాయి కృష్ణ ఇద్దరూ పక్కాగా రాసుకున్నారు. షూటింగ్ సమయంలో డైలాగుల్లో చిన్న చిన్న మార్పులు తప్పితే మజాకా కథ నా దగ్గరికి వచ్చేసరికే కంప్లీట్ గా వుంది.

రాములమ్మ పాట సెలెక్షన్ మీదేనా ?
-అవును. నాకు యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్ చాలా నచ్చుతున్నాయి. చాలా చక్కగా చేస్తున్నారు. అలా జనాల్లోకి వెళ్ళిన ఓ పాటని మళ్ళీ మన స్టయిల్ లో వినిపిస్తే బావుంటుందనే ఆలోచనతో ఆ పాటని చేశాం. నిజానికి అలా యూట్యూబ్ లో హిట్ అయిన ఓ నాలుగు పాటలు ఒక సినిమాలో పెట్టాలనే ఆలోచన కూడా వుంది. మంచి కమర్షియల్ కథ కుదిరితే అలా చేయొచ్చు.

అన్షు గారి ఛాయిస్ ఎవరిది ?
-ఆ క్యారెక్టర్ కి ఆల్రెడీ హీరోయిన్ ఇమేజ్ వున్న ఓ ఆర్టిస్ట్ తో చేయిస్తే బావుంటుందని అనుకున్నాను. అప్పుడు మన్మధుడులో అన్షు అయితే ఎలా ఉంటుందని ప్రసన్నతో అన్నాను. తర్వాత నిర్మాత రాజేష్ గారు ఆమెని సంప్రదించారు. నేనే ఫోన్ లో మాట్లాడిన ఈ క్యారెక్టర్ గురించి చెప్పాను. ఆమెకు తెలుగు రాదు, అయినప్పటికీ చాలా కష్టపడి నేర్చుకొని ప్రతి డైలాగ్ కి అర్ధం తెలుసుకొని నటించడం చాలా అనందంగా అనిపించింది. ఒక అమ్మ క్యారెక్టర్ ఎలా చూడాలని అనుకుంటారో అన్షు క్యారెక్టర్ అలా వుంటుంది.  

ఖుషి రిఫరెన్స్ సీన్ సెన్సార్ అయిపోయందా ?
-ఆ సీన్ వుంది. కాకపోతే డైలాగ్ ని సెన్సార్ చేశారు. నిజానికి ఆ డైలాగ్ వుంటే థియేటర్ లో మరో హై వుండేది. సెన్సార్ వాళ్ళకి కూడా ఆ డైలాగ్ చాలా నచ్చింది. చాలా నవ్వుకున్నారు. కానీ కొన్ని రూల్స్ కారణంగా సెన్సార్ చేయాల్సి వచ్చింది.

మజాకా మ్యూజిక్ గురించి ?
-మజాకా స్టొరీ బేస్డ్ గా చేసిన సాంగ్స్. దానికి తగ్గట్టుగానే డిజైన్ చేశాం. లియోన్ జేమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.  

మజాకా నిర్మాతల గురించి ?
-రాజేష్ గారు అనిల్ గారు చాలా సపోర్టివ్ ప్రొడ్యూసర్స్. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.

-మజాకాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన వుంది. చివర్లో డబుల్ మజాకా అని వేశాం. అయితే మరో టైటిల్ తో వెళ్ళాలా అనే ఐడియా కూడా వుంది.

మేము వయసుకు వచ్చాం నుంచి మజాకా వరకూ మీ జర్నీ ఎలా వుంది ?
-చాలా బావుంది అండి. నా వల్ల ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబ్యూటర్స్, ఆడియన్స్ నష్టపోవడం లేదు. అలాంటి సినిమాలు చేస్తున్నందుకు హ్యాపీ.

నిర్మాతగా చేస్తున్న సినిమాల గురించి ?
-చౌర్యపాఠం ఏప్రిల్ లో  రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ‘అనకాపల్లి’ కల్ట్ లవ్ స్టొరీ. ఇది నేను చాలా ఏళ్ల క్రితం రాసిన కథ. చాలా రా లవ్ స్టొరీ.

డబుల్ ధమాకా గురించి
-రవితేజ గారితో డబుల్ ధమాకా చేస్తే బావుంటుంది. అదే ప్రయత్నం చేస్తున్నాను.