విజయ్ ‘మాస్టర్’ ఓటీటీ రిలీజ్‌కి డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా వచ్చిన ‘మాస్టర్’ సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ వసూళ్లు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఒక తమిళనాడులోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. విజయ్ కెరీర్‌లోనే రూ.200కోట్లకుపైగా వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.

MASTER ON AMAZON PRIME

జనవరి 29 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మాస్టర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను నిర్మించగా.. విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మాళవిక మోహన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. మాస్టర్ జనవరి 13న విడుదల అవ్వగా.. విడుదలైన 16 రోజుల్లోనే ఓటీటీలో విడుదల కాబోతోంది.

అయితే విడుదల అయిన 16 రోజుల్లోనే మాస్టర్‌ను ఓటీటీలో విడుదల చేయనుండటంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. థియేటర్లలో సినిమా బాగా ఆడుతున్న సమయంలో విడుదలైన కేవలం 16 రోజుల్లోనే ఓటీటీకి ఇవ్వడం ఏంటీ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టం జరుగుతుందని, ఇది సరైన నిర్ణయం కాదంటున్నారు. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడవడం వల్ల తమకు నష్టం జరుగుతుందని, మరో వారం మాస్టర్ థియేటర్లలోనే నడిస్తే తమకు లాభం జరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో మాస్టర్ ఓటీటీ రిలీజ్‌ని తీవ్రంగా పరిగణించిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.. దీనిపై చర్చలు జరుపుతోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంతో సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.