మిలిటెంట్ దాడిలో మరణించిన ప్రవీణ్ కుమార్ కుటుంబానికి మంచు కుటుంబం అండ

చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన 36 సం||లు వయసు కల్గిన సి.హెచ్. ప్రవీణ్ కుమార్ భారత సైన్యంలో అవల్దార్ గా పని చేస్తున్నాడు. శ్రీనగర్ 18వ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తుండగా.. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుదాడిలో నవంబరు 8వ తేది, 2020 సం|| తుపాకి కాల్పులలో వీరమరణం పొందాడు.

ఇతడికి రజిత అనే భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అందరూ వీరిని పరామర్శించారే కానీ ప్రభుత్వసాయం తప్ప వీరికి ఇతర ఎటువంటి సహాయమూ అందలేదు. వీరి కుటుంబంలో 64 మంది సభ్యులు భారతసైన్యంలో పని చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్న 18వ రెజిమెంట్ అధికారి కల్నల్ OLV, నరేష్, కమాండింగ్ ఆఫీసర్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ డా॥ మోహన్ బాబు గారికి స్వయంగా లేఖ వ్రాశారు. వారి కుటుంబాన్ని ఏ విధంగానైనా ఆదుకోమని లేఖ ద్వారా కోరారు.

ఆ లేఖను చూసి స్పందించిన డా॥ మోహన్ బాబు గారు వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ కుమార్తె సి.హెచ్. లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుండి పూర్తి ఉచితవిద్య నందించడానికి ఎంతో సహృదయంతో, ఉదారగుణంతో, మానవతా దృష్టితో అంగీకరించారు. ఇందుకు ఎంతో సంతోషించిన ప్రవీణ్ కుమార్ భార్య ఉచితవిద్యకు సహకరించిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల CEO విష్ణు మంచు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

దీనికి ప్రతిస్పందించిన CEO విష్ణు మంచు గారు ఎంతో ఆర్ద్రతతో మాట్లాడారు. ఇందుకు కృతజ్ఞతలు అక్కర్లేదన్నారు.. దేశ సరిహద్దులో భారత వీరులు కంటికి రెప్పలా కాపాడుతుండడం వల్ల మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. వారిని ఆదుకోవడం, అండగా నిలవడం, చేతనైన సహాయం చెయ్యడం.. ప్రతి భారతీయుని బాధ్యత అని ఆమెను ఓదార్చారు.