మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌తో `గుణ 369` రొమాన్స్!

Anagha
Anagha

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌లకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ద‌శాబ్దం క్రితం తెలుగులో ఓ ఊపు ఊపిన అసిన్‌, న‌య‌న‌తార‌, ప్రియ‌మ‌ణి వంటివారంద‌రూ మ‌ల్లువుడ్ భామ‌లే. ఇప్పుడు టాప్ హీరోల‌తో్ జ‌త‌క‌డుతోన్న నిత్యామీన‌న్‌, కీర్తి సురేష్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, నివేదా థామ‌స్‌, ప్రియా పి వారియ‌ర్‌… ఓపిగ్గా తెలుసుకోవాలేగానీ, ఈ లిస్టు చాంతాడంత పెరుగుతూనే ఉంటుంది. ఈ లిస్ట్ లో యాడ్ ఆన్ అవుతున్నారు మ‌రో మ‌ల‌బారు బ్యూటీ. ఆమె పేరు అన‌ఘ. ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ స‌ర‌స‌న గుణ 369లో అన‌ఘ జోడీ క‌డుతున్నారు.

స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గుణ 369. కార్తికేయ హీరోగా న‌టించారు. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ కంటెంట్ డ్రైవ‌న్ ఫిల్మ్స్ తెలుగులో రావ‌డం లేద‌నుకునేవారికి స‌మాధానం చెప్పే విధంగా మా `గుణ 369` ఉంటుంది. టీజ‌ర్ చూసిన వారంద‌రూ అదే మాట అంటున్నారు. టీజ‌ర్‌లో హీరోయిన్‌ని చూసిన‌ప్ప‌టి నుంచి చాలా మంది ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఆమె పేరు అన‌ఘ. కేర‌ళ భామ‌. మ‌ల‌యాళ న‌టీమ‌ణుల‌కు మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడూ మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. అనఘ కూడా టాప్ రేంజ్‌కి వెళ్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. త‌మిళ చిత్రం `న‌ట్పే తునై`లో అన‌ఘ న‌టించారు. అందులో కొన్ని సీన్లు చూసి ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నాం. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ త‌మిళంలో `న‌ట్పే తునై`లో న‌టించిన అన‌ఘ‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఆమె స్టార్ మెటీరియ‌ల్ అని మా న‌మ్మ‌కం. మా సినిమాలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమెది. చాలా చ‌క్క‌గా న‌టించింది. అదే స‌మ‌యంలో గ్లామ‌ర్ విష‌యంలోనూ ఎక్క‌డా రాజీప‌డ‌లేదు. ఆమె స్వ‌త‌హాగా క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ కావ‌డంతో, డ్యాన్సుల విష‌యంలోనూ చాలా హెల్ప్ అయింది. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలు ఆమెలో ఉన్నాయి. మా హీరో కార్తికేయ స‌ర‌స‌న చ‌క్క‌గా స‌రిపోయింది. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ గురించి సినిమా విడుద‌ల‌య్యాక అంద‌రూ త‌ప్ప‌క మాట్లాడుకుంటారు. `గుణ 369` షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్ : స‌త్య కిశోర్‌, శివ మల్లాల.