హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబర్ 27న ‘మైదాన్`.

ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఒక కోచ్ నిజ జీవిత కథ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీవితంలో అయినా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిమంతమైన కథగా మైదాన్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు. `బధాయి హో` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కోల్ కత్తా, లక్నో, ముంబై నగరాల్లో 50 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ కి చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, `బధాయి హో` ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న`మైదాన్` చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు.  స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను సైవిన్ కాద్రస్, రితేష్ షా అందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మైదాన్ నవంబర్ 27, 2020న విడుదల అవుతోంది.