
సూపర్ స్టార్ మహేష్ బాబు సాయి సూర్య, సురానా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న (సోమవారం) విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే, సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా తాను ఈ తేదీన హాజరు కాలేనని మహేష్ బాబు తెలిపారు. మరో తేదీ ఇవ్వాలని ఈడీ అధికారులకు ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈడీ అధికారులు మహేష్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కొత్త తేదీ ఇచ్చే అవకాశం ఉంది.
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దాని అనుబంధ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై వేల కోట్ల రూపాయల బ్యాంకు మోసం ఆరోపణల నేపథ్యంలో చెన్నై ఈడీ విభాగం సోదాలు నిర్వహించింది. సురానా గ్రూప్ ఎండీ నరేంద్ర ఇంటితో పాటు సాయి సూర్య డెవలపర్స్ సతీష్ నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. సురానా గ్రూప్ షెల్ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది.
ప్రమోషన్ పేరిట సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబు భారీ మొత్తం నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ ద్వారా మొత్తం రూ. 5.9 కోట్లు స్వీకరించినట్లు ఈడీ తేల్చింది. ఈ నేపథ్యంలోనే మహేష్‌కు నోటీసులు జారీ చేసి, ఏప్రిల్ 28న విచారణకు రావాలని ఆదేశించారు. ఈ కేసు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది.