ఆర్జీవీ సినిమాకు తొలగిన అడ్డంకులు

ఎప్పుడూ సంచలనాలతో వార్తల్లో నలుగుతూ ఉంటాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. వివాదాలతో నిరంతరం వార్తల్లో ఉండటం ఆయన స్ట్రైల్. ఆయన తీసే ప్రతి సినిమా ఎప్పుడూ వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్యపై ‘మర్డర్’ అనే సినిమాను ఆర్జీవీ తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాను నిలిపివేయాల్సిందిగా ప్రణయ్ భార్య అమృత నల్గొండ కోర్టుకెక్కడంతో సినిమా విడుదలను ఆపేయాల్సిందిగా కోర్టు గతకొద్దిరోజుల క్రితం స్టే విధించింది. అయితే తాజాగా ఆ స్టేను కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ‘మర్డర్’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి పలు పాత్రల్లో నటిస్తున్నారు. కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో త్వరలో మర్డర్ సినిమా విడుదలయ్యే అవకాశముంది. కాగా ఇప్పటికే మర్డర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా.. ఇందులో సన్నివేశాలు వివాదాస్పదంగా మారిపోయాయి.