తెలుగు చిత్ర పరిశ్రమలోని జూనియర్ ఆర్టిస్టులకు అండగా కృష్ణసాయి

సినిమా అనేది రంగుల ప్రపంచం. తెర వెనుక అంతకు మించిన కథలు కనిపిస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి. అలాంటి సినీ కళాకారులకు తనవంతు సాయం చేస్తున్నాడు టాలీవుడ్ హీరో కృష్ణసాయి. జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి ఆర్థిక కష్టాలు చుట్టిముట్టడంతో తక్షణ సాయం కింద 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశాడు.

పలు సినిమాల్లో నటించిన పొట్టి జానీకి ఇటీవల షూటింగ్ లు లేక ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో కృష్ణసాయి.. పొట్టి జానీ నివాసానికి వెళ్లి భరోసాగా నిలిచారు.

ఈ సంద‌ర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడుతూ… ”తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీ లాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నా వంతు సాయం చేస్తున్నాను. వారి ప‌రిస్థితిని అర్థం చేసుకుని సినీ పెద్దలు, నటీనటులు ప్రతి ఒక్కరు అండగా ఉండాలి, భ‌రోసా అందిచాలి” అని కోరారు.

హీరో కృష్ణసాయి రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో నిరూపించుకుంటున్నారు. ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. సినీ రంగంతో పాటు ఇతరులకు కూడా ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘సుందరాంగుడు’, ‘జ్యువెల్‌ థీఫ్‌’ సినిమాల్లో హీరోగా నటించాడు హీరో కృష్ణసాయి. ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ నిర్వహిస్తూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. అపద్భాందవుడిలా ఆదుకుంటున్నారు.