తెలుగు సినిమా రంగానికి నిర్మాత డివిఎస్ రాజు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి .
చిత్ర నిర్మాతగా తమ డివిఎస్ ప్రొడక్షన్స్ ద్వారా ఉత్తమోత్తమ చిత్రాలను అందించిన రాజు గారు సినిమా రంగ సంస్థలకు నేతృత్వం వహించి వాటిని అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నతుడు .సినిమా అంటే తన కుటుంబంగా భావించిన రాజు గారు అందుకోసం తన జీవితాన్నే అంకితం చేసిన నిస్వార్ధ జీవి , నిరాడంబరుడు రాజుగారు, ఆయన చూపించిన బాటలోనే ఇవ్వాళ సంస్థలు నడుస్తున్నాయంటే అందుకు రాజు గారి దక్షతే కారణం .ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎఫ్ .డి .సి అధ్యక్షుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తరలించడంలోను , రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ఆస్కార్ అవార్డు సినిమా “గాంధీ ” విడుదల తరువాత వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని తీసుకొని అప్పటి ఎన్ .ఎఫ్ .డి .సి అధ్యక్షుడుగా రాజుగారు భారతీయ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చెయ్యడంలోను కీలకమైన భూమిక పోషించారు .ఆ నిధి నుంచి దేశంలో పేదరికంలో వున్న సినిమా కార్మికులకు నెల నెలా పింఛన్ గా అందుతుంది .
ఒకవైపు సినిమా నిర్మాణం చేస్తూనే సినిమా రంగ సంస్థలను బలోపేతం చెయ్యడంలో రాజుగారు విశేషమైన కృషి చేశారు .1950 లో మహానటుడు ఎన్ .టి .రామారావు గారితో పరిచయం రాజు గారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది . రాజు గారి వ్యక్తిత్వం నచ్చిన రామారావు గారు తన నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థలో ఎన్ .టి .ఆర్ భాగస్వామిగా చేసుకొని ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు . 1960లో రాజు గారు డి .వి .ఎస్ ప్రొడక్షన్స్ అన్న స్వంత సంస్థను ప్రారంభించారు . అయినా రామారావు గారిఆయన మైత్రీ బంధం కొనసాగింది . ఇద్దరూ ఎంతో ఆత్మీయులుగా ఉండేవారు .చైనా యుద్ధం , రాయలసీమ కరువు , దివిసీమ ఉప్పెన లాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎన్ .టి .రామారావు నాయకత్వంలో తెలుగు సినిమా రంగం సేవలందించడానికి ముందుకొచ్చేది. ప్రజలకు ఆర్ధికంగా చేయూతనివ్వడానికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారు . రామారావు గారి నేతృత్వంలో రాజు గారే వీటిని సమన్వయము చేసేవారు .
1983లో రామారావు గారు ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన తరువాత రాజు గారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థకు అధ్యక్షుడుగా నియమించారు . తెలుగు సినిమాను హైదరాబాద్ తీసుకురావడంలో రాజుగారు నిర్వహించిన పాత్ర అపూర్వం. అలాగే 1986 లో ఫిల్మోత్సవ్ కోసం పబ్లిక్ గార్డెన్ లో 90 రోజుల్లో లలిత కళాతోరణం నిర్మాణం కావాలని రామారావు గారు ఆదేశించారు. పగలు రాత్రి శ్రమించి రామారావు గారి ఊహల ప్రకారం లలితకళా తోరణాన్ని రూపొందించడంలో రాజు గారి కృషి, పట్టుదల మాటల్లో చెప్పలేము. హైదరాబాద్ లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించడంలో కూడా రాజు గారి పాత్ర అనన్య సామాన్యము .
ఫిలిం నగర్ గృహ నిర్మాణ సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ , జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ, ఫిలిమ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మొదలైన సంస్థల ను అభివృద్ధి చేసి మార్గదర్శకాలు రూపొందించడంలో రాజు గారి కృషి అసమానం , అనిర్వచనీయం .భారతీయ సినిమా రంగానికి డివిఎస్ రాజు గారి నిస్వార్ధ సేవ, అంకిత భావం , అవిరళ కృషి ని గుర్తించిన భారత ప్రభుత్వం 2001వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రకటిచింది . ఈ అవార్డును అప్పటి రాష్ట్రపతి కె .ఆర్ .నారాయణన్ రాజు గారికి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ప్రదానం చేశారు తెలుగు సినిమా నిర్మాతగా గారు గారికి దక్కిన గౌరవం ఇది .
నిర్మాతగా డివిఎస్ రాజు గారు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆరోగ్యకరమైన , సందేశాత్మక ఎన్నో చిత్రాలను రూపొందించారు. .
డిసెంబర్ 13 , 1928న తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో జన్మించిన రాజుగారు , 13 నవంబర్ 2010న తన 81వ సంవత్సరంలో ఇహలోక యాత్ర ముగించారు . .
భారతీయ సినిమా రంగానికి పద్మశ్రీ డి .వి .ఎస్ .రాజు గారుఎప్పటికీ ప్రాతః కాల స్మరణీయులే !
ఈరోజు డి .వి ఎస్ రాజు 94వ జయంతి.
-భగీరథ, సీనియర్ జర్నలిస్టు .