సినిమా థియేటర్లకు భారీ రాయితీలు

కరోనా ప్రభావం వల్ల మార్చి నుంచి మొన్నటివరకు లాక్‌డౌన్ విధించడంతో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం జరిగింది. షూటింగ్‌లు ఆగిపోవడం, థియేటర్లు మూతపడటంతో సినీ కార్మికులతో పాటు థియేటర్ల యాజమాన్యాలకు తీరని నష్టం జరిగింది. దీంతో సినిమా ఇండస్ట్రీని ఆదుకునేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ప్రదేశాల్లో ఉచితంగా షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు పలు వరాలు ప్రకటించింది.

KERALA CINEMA THEATERS

40 వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు సహా సామాన్య ప్రజలకు అందించే అన్ని సదుపాయాలు అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే సినిమా థియేటర్ల యాజమాన్యాలు గత ఏప్రిల్ నుంచి చెల్లించాల్సిన కరెంట్ బిల్లులను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వమే కాకుండా తాజాగా కేరళ ప్రభుత్వం కూడా థియేటర్ల యాజమాన్యాలకు శుభవార్త తెలిపింది.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్రంలోని థియేటర్ల యాజమాన్యాలు ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ కట్టనవసరం లేదని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అలాగే సినిమా థియేటర్లు చెల్లించాల్సిన కరెంట్ బిల్లులను 50 శాతానికి తగ్గిస్తామన్నారు. అలాగే వివిధ లైసెన్సుల చెల్లుబాటును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేరళ సీఎం పినరయి విజయన్‌ను మలయాళం సినిమా పరిశ్రమకు చెందిన సినీ నటులు దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి, మోహన్ లాల్, మంజూవారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆసిఫ్ అలీ, తదితరులు ధన్యవాదాలు చెప్పారు. సినిమా పరిశ్రమను బలోపేతం చేసేలా రాయితీలు ఇచ్చిన సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు అని మోహన్ లాల్ ట్వీట్ చేశారు.