తలైవి మొదలయ్యింది… కంగనా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను తలైవి పేరుతో రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆదివారం చెన్నైలో ప్రారంభ‌మైంది. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్, జయలలితగా కనిపించనుంది. తమిళ భాషలో చేస్తున్న మొదటి సినిమా కాబట్టి టైటిల్ రోల్ కి తగ్గట్లు కనిపించడానికి కంగనా చాలా ప్రిపేర్ అయ్యింది. క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్న కంగనా, తలైవిని అదే టైటిల్ తో హిందీలో కూడా రిలీజ్ చేయించడానికి ప్లాన్స్ వేస్తోంది.

ఎంజీఆర్ లేకుండా జ‌య‌లలిత బ‌యోపిక్‌ను ఊహించ‌లేం. అలాంటి లెజెండ్రీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద‌స్వామి న‌టిస్తున్నారు. కరుణానిధిగా ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తలైవి సినిమా గ్రాండ్ లాంచ్ అయ్యింది. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్న‌ర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.