రజనీపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు

త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడి రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ఇప్పటినుంచే వ్యూహలు రచిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికలంటేనే సినీ ప్రముఖుల సందడి ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం సినీ సెలబ్రెటీలు ఎక్కువమంది రాజకీయాల్లో ఉండటమే. గతంలో సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లిన ఎంజీఆర్, జయలలిత తమిళ ప్రజల మనస్సులను గెలుచుకుని సీఎంలు కూడా అయ్యారు. ఇప్పుడు వారి బాటలోనే మరికొంతమంది సినీ ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు.

KAMALHASAN

ఇప్పటికే విశ్వనటుడు కమల్‌హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ పెట్టి గత లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలోకి దింపాడు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో కొన్ని సీట్లనైనా గెలుచుకోవాలని కమల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవలే రజనీకాంత్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కమల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రజనీకాంత్ సిద్ధాంతాలు వేరని, తన సిద్దాంతాలు వేరని అన్నాడు. తామిద్దరం మంచి మిత్రులం అని, రాజకీయాల్లో తమ సిద్దాంతాలు ఒకే రకంగా ఉంటాయా అన్నది రజనీ తీసుకోబోయే నిర్ణయాలను బట్టి ఉంటుందన్నాడు. ఇక ఎంజీఆర్ కలను సాకారం చేయగలిగితే ఆయనకు తానే రాజకీయ వారసుడిని అని కమల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.