
ఆర్కే ఇంటర్నేషనల్ సంస్థపై కేఎస్ రామకృష్ణ & కే రామచరణ్ నిర్మాతలుగా ప్రమోద్ సుందర్ రచనా,దర్శకత్వంలో నేడు(మే 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘కలియుగం 2064’. శ్రద్ధ శ్రీనాథ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాని హ్యారీ, అజ్మల్, సంతోష్, మణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కే రామ్ చరణ్ ఈ చిత్రానికి డిఓపిగా పనిచేయగా డాన్ విన్సెంట్ సంగీతం అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం రండి :
కథ: 2064 టైంకి 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఆ తర్వాత మనుషులకి ఎలాంటి దుస్థితి వస్తుంది.తిండి కోసం మనుగడ కోసం మనుషులు ఎలా మారిపోతారు. ఎంత క్రూరంగా తయారవుతారు.. అనే థీమ్ తో ఈ సినిమా రూపొందింది. ఇందులో బలం, ఆధిపత్యం కలిగిన వారు రెసిడెన్స్ ను ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు తీసుకెళ్లే ఆహారం కోసం శక్తి(కిషోర్) అలాగే అతని అనుచరులు చేసిన ప్రయత్నంలో… శక్తి తప్ప మిగిలిన వాళ్ళందరూ రెసిడెన్స్ వారి చేతుల్లో మరణిస్తారు. ఆ టైంలో సేఫ్ హౌస్ అనేది ఒకటి ఉంది అని శక్తికి తెలుస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ అతనికి థామస్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతన్ని శక్తి ఏం చేయాలనుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితి వచ్చి పడింది.? భూమి(శ్రద్దా శ్రీనాథ్) అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఆ తర్వాత ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అనేది మిగిలిన కథ.
నటీనటులు నటన:
ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శ్రద్ధ శ్రీనాథ్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే జెర్సీ, మెకానిక్ రాకి, డాకు మహారాజు వంటి చిత్రాలలో నటించిన ఈమె నటన ప్రేక్షకులు చూశారు. అయితే ఈ చిత్రం విషయానికి వచ్చేప్పటికి పూర్తిగా కరువులో ఉన్న ప్రపంచంలో అప్పటి పరిస్థితులకు తగ్గట్లు మేకప్ తో అటువంటి వాతావరణంలో ఎంత ఇబ్బంది పడుతూ కేవలం బ్రతకడమే ఒక పోరాటంలా ఉండే పరిస్థితులలో ఆమె ఉన్నట్లు అటు ఎక్స్ప్రెషన్స్ పరంగా అలాగే ఇటు నటన పరంగా తనదైన శైలిలో పూర్తి పర్ఫార్మన్స్ ఇచ్చారు శ్రద్ధ శ్రీనాథ్. అవి చాలా నేచురల్ గా ఉన్నాయి. అలాగే మరోసారి తన వైవిధ్యమైన నటన కనపరిచాడు. తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేశాడు. ఇక టామ్ గా చేసిన ఇనియన్ సుబ్రమణి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మిగతా వారితో పోలిస్తే ఇతని పాత్ర కొంచెం ప్రత్యేకంగా అలాగే సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరూ.. తమ పాత్రలకి బోనస్ అయ్యేవిధంగా నటించారు. అలాగే యాక్షన్ సీన్స్ లో ఎక్కువగా మిగతా నటీనటులు కనిపిస్తూ పర్ఫెక్ట్ గా తమ ఔట్పుట్ ఇచ్చారు.
సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్రం గురించి ముందుగా చెప్పాల్సింది సాంకేతిక నిపుణుల పనితనం గురించి. తాను రాసుకున్న పాయింట్ ను తెరపై కొత్తగా ఆవిష్కరించడంలో దర్శకుడు ప్రమోద్ సుందర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. తక్కువ బడ్జెట్లో ఒక హై రేంజ్ సినిమాను మనకు అందించారు. అది డిఓపి రామ్ చరణ్ వల్ల సాధ్యమైంది. ఇండస్ట్రీకి చాలా అవసరమైన టెక్నిషియన్ ఇతను. పైగా పిసి శ్రీరామ్ శిష్యుడు. భవిష్యత్తులో తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయనే నమ్మకం కలిగించాడు ఇతని విజువల్స్ తో..! లొకేషన్స్ కు తగ్గట్లు కలర్ ప్యాలెట్ చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తపడ్డారు. చిత్రంలోని లొకేషన్స్ తో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. వి ఎఫ్ ఎక్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్:
కథ, విజువల్స్, పెర్ఫార్మన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్:
రెండవ భాగం కొంచెం నిదానంగా సాగడం
సారాంశం:
చక్కటి విజువల్స్ తో మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు.నిజంగానే భవిష్యత్తులో ‘3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయా? అప్పటికి మనం ఉండకపోతేనే మంచిది.ఎలాంటి పరిస్థితులు వచ్చినా మానవత్వాన్ని వదిలేయకూడదు’ అని చక్కటి మెసేజ్ ను ఈ ‘కలియుగమ్ 2064’ తో ఇచ్చారు.