చిత్రపురి కొవిడ్ బాధితులకు అండగా “మనం సైతం”

చిత్రపురి కాలనీలో కొవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ మానస పుత్రిక “మనం సైతం”. ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ప్రతి రోజూ ఆహారం, మందులు, ఆక్సీజన్ సిలిండర్లు, ఆక్సీజన్ కాన్సన్ ట్రేటర్స్ అందిస్తున్నారు. ఉదయం నుంచే మొదలయ్యే ఈ సేవా కార్యక్రమాలు రాత్రి దాకా కొనసాగుతున్నాయి. బాధితుల అవసరాలు తెలుసుకుని, మనం సైతం టీమ్ తక్షణమే స్పందించి వారికి సహాయం అందిస్తోంది. ఆరోగ్యకరమైన భోజనాలను ప్యాక్ చేసి బాధితుల వద్దకు వెళ్లి అందజేస్తున్నారు. మనం సైతం అందిస్తున్న మందులు ఆహారం ఆక్సీజన్ తో త్వరగా కోలుకుంటామనే ధైర్యం కొవిడ్ బాధితుల్లో కనిపిస్తోంది.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…చిత్రపురి కాలనీ కరోనా బాధితులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. మనం సైతం తరుపున భోజనం, మందులు, ఆక్సీజన్ సిలిండర్, ఆక్సీజన్ కాన్సన్ ట్రేటర్లు అందజేస్తున్నాం. ఈ కష్టకాలంలో మా చిత్రపురి వాసులకు అండగా నిలబడటం సంతృప్తిగా ఉంది. వారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా సంతోషంగా కాలనీలో ఉండటమే మాకు కావాల్సింది. అప్పుడే మా సేవకు నిజమైన ఫలితం దక్కింది అనుకుంటాం. అవసరంలో ఉన్నవారి కోసం ఎప్పుడైనా ఎక్కడికైనా సిద్ధం. అన్నారు.

కాదంబరి కిరణ్ సారథిలా నడిపిస్తున్న ఈ సేవా వాహినికి వల్లభనేని అనిల్ కుమార్, అనిత నిమ్మగడ్డ, రుద్రరాజు రమేష్, సీసీ శ్రీను, రమేష్ రాజా, నాగరాజు, ప్రభాకర్, అంజలి, మీనా తదితరులు తమ పూర్తి సహకారం అందిస్తున్నారు.