బుల్లితెరపై ఎన్టీఆర్‌నే టాప్

ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1ను హోస్ట్ చేసి బుల్లితెరపై కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ షోతో తనలోని మరో టాలెంట్‌తో ప్రేక్షకులను తారక్ ఎంటర్‌టైన్ చేశాడు. ఎన్టీఆర్ హోస్టింగ్‌కు ప్రేక్షకులందరూ ఫిదా అవ్వగా.. ఈ షోకు భారీ టీఆర్‌పీ రేటింగ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇంక ఏ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేయలేదు. అయితే త్వరలోనే ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై అడుగుపెట్టనున్నాడు. జెమిని టీవీలో ఒక కొత్త షో హోస్ట్ చేసేందుకు ఎన్టీఆర్ సైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ షోకు సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా బయటికి రాలేదు. కానీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ఈ షో ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ఈ షో హోస్ట్ చేసేందుకు ఎన్టీఆర్ తీసుకుబోయే రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ షో 60 ఎపిసోడ్లు ఉంటుందట. ఒక్కో ఎపిసోడ్‌ హోస్ట్ చేసేందుకు తారక్ రూ.30 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడట. అంతే మొత్తం 60 ఎపిసోడ్లకు రూ.18 కోట్లు తీసుకోనున్నాడన్న మాట. ఇంత రెమ్యూనరేషన్ ఇప్పటివరకు బుల్లితెరపై ఏ హీరో తీసుకోలేదని, ఎన్టీఆర్‌ ఫస్ట్ అని చెబుతున్నారు.

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ షో సూపర్ సక్సెస్ అయింది. దీంతో తారక్‌కు ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాటు సమాంతరంగా ఎన్టీఆర్ ఈ కొత్త షోను హెస్ట్ చేయనున్నాడట.