కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం మధ్యలో యాక్సిడెంట్ కావడంతో ఆస్పత్రిలో నుంచి టీడీపీకి ఓటు వేసి చంద్రబాబును గెలిపించాలని కోరారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్.. సినిమాలతో వరుస బిజీగా ఉన్నాడు. వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తిరిగి వస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

jr ntr

హోరాహోరీగా జరిగిన గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ తిరిగి టీడీపీలోకి రావాలని కార్యకర్తలు, అభిమానులు బలంగా కోరుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల గురించి అసలు ఆలోచించకుండా సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. కానీ ఎన్టీఆర్‌ ఖచ్చితంగా భవిష్యత్తుల్లో రాజకీయాల్లోకి రావడం ఖాయమని, టీడీపీ నుంచి సీఎం కావడం ఖాయమని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఒక ప్లెక్సీ ఇప్పుడు కలకలం రేపుతోంది. నూతన సంవత్సరం వస్తున్న క్రమంలో శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ నేతలు ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పెట్టి కాబోయే సీఎం అంటూ రాశారు. దీంతో ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ టీడీపీ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఫొటోలు చాలా దర్శనమిచ్చాయి.