ఒక్క సినిమాకు రూ.20 కోట్ల భారీ రెమ్యూనరేషన్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో యాష్ రాజ్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘పఠాన్ ‘మూవీలో హీరో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతడు దాదాపు రూ.20 కోట్ల భారీ రెమ్యూనరేషన్‌ను తీసుకోనున్నాడని సమాచారం. జాన్ అబ్రహం కెరీర్‌లోనే ఇదే అత్యధిక రెమ్యూనరేషన్. దాదాపు 60 రోజులపాటు జాన్ అబ్రహం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. థూమ్ సినిమాలో విలన్‌గా జాన్ అబ్రహం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు పఠాన్ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా.. ఈ నెల చివరివారంలో ముంబైలో షారూఖ్‌ఖాన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుండగా.. ఇందులో పాల్గొనేందుకు సినిమా యూనిట్‌తో కలిసి జాన్ ఆబ్రహం కూడా విదేశాలకు వెళ్లనున్నాడు.

ఈ సినిమాలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించనుంది. ఇది యాక్షన్ సినిమా కావడంతో ఇందులో హీరో, విలన్‌కు మధ్య జరిగే సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయని తెలుస్తోంది.