రజినీ రెడీ అవుతున్నాడు…

రాజకీయాల్లోకి వెళ్తున్నాడు సినిమాలు తగ్గిస్తాడు అనుకుంటే రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ రజినీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నాడు. 2019 సంక్రాంతికి పేట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజినీ, ఇప్పుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దర్బార్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డ్యూయల్ పాత్రల్లో రజినీకాంత్ కనిపిస్తున్న దర్బార్ ప్రధాన భాగం అంతా ముంబైలోనే షూట్ చేశారు. రెండు పాత్రల్లో రజనీకాంత్ కనిపించనుండగా అందులో ఒకటి పోలీస్ అధికారి, రెండో టీచర్‌ పాత్ర కావడం విశేషం. 1992లో వచ్చిన పాండ్యన్ సినిమా తర్వాత రజనీకాంత్ పోలీసు డ్రెస్‌లో కనిపించడం ఇదే తొలిసారి.

తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన రజినీ చెన్నై తిరిగొచ్చారు. దర్బార్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ హీరో సునిల్ శెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ప్రతీక్ బబ్బర్, నివేదా థామస్, దిలీప్ తాహిల్, నవాబ్ షా, గురు భుల్లార్, యోగిబాబు, శ్రీమన్, జతిన్ శర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తలైవా 167వ చిత్రంగా తెరకెక్కుతున్న దర్బార్ సినిమా సంక్రాంతి పండుగ బరిలో నిలబడేందుకు రెడీ అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత రజినీకాంత్ సినిమాకి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫిని అందిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రజినీ చరిష్మాకి మురుగదాస్ మార్క్ కంటెంట్ కూడా సరిగ్గా కలిస్తే దర్బార్ సినిమా సంక్రాంతి కాసుల వర్షమే కురిపిస్తుంది.