ఇషా చావ్లా అంధురాలి పాత్రలో మర్డర్ మిస్టరీ గా రూపొందుతోన్న `అగోచ‌ర’!!

తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఢిల్లీ బ్యూటీ ఇషా చావ్లా ప్రధాన పాత్రలో రూపొందుతున్న అగోచ‌ర చిత్రంలో ఒక భిన్నమైన పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. మర్డర్ మిస్టరీ గా తెరకెక్కుతున్న అగోచ‌ర లో ఇషా చావ్లా అంధురాలి గా విభిన్న షేడ్స్ తో చిత్రంలో ఒక బలమైన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.

ఇషా చావ్లా మాట్లాడుతూ, ” కబీర్ లాల్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. తన దర్శకత్వంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ విని చాలా ఎక్సైట్ అయ్యాను. ఇలాంటి పాత్ర కోసమే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాను. కబీర్ గారు ఈ స్టోరీ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పేశాను. బ్లైండ్ క్యారక్టర్ చేయడం మానసికంగానే కాకుండా ఎమోషనల్ గా కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇందులో నాది మానసికంగా చాలా బలమైన పాత్ర. నా లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ చిత్రం.” అన్నారు.

కమల్ కామరాజు ఆమెకు మద్దతు ఇచ్చే భర్త గా సైకాలజిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. అగోచ‌ర ఒక లవ్ రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఒక సంఘటన తో జీవితాలు ఎలా మారిపోయాయి అనే ఇతివృత్తం తో కథ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రస్తుతం డెహ్రాడూన్ లో అందమైన రిసార్ట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న అగోచ‌ర ను లవ్లీ వరల్డ్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. జూన్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇషా చావ్లా, క‌మ‌ల్ కామ‌రాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సునీల్ వ‌ర్మ‌, బ్రహ్మానందం, అజ‌య్ కుమార్ సింగ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.