ఆ ఒక్కడూ లేకుంటే

ఐపీఎల్‌ 2020 నాలుగో మ్యాచ్ సీఎస్‌కే, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగింది. సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏ పరిస్ధితులోనూ టార్గెట్ చేధించే దిశగా కనిపించలేదు. విజయ్ వచ్చిన వెంటనే అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ వాట్సన్ దాటిగా ఆడినట్లు కనిపించింది కానీ ఆ తర్వాత తెలిపోయాడు. రాహుల్ తేవాటియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డు ప్లెసిస్ మినహ ఎవరూ మ్యాచ్‌లో రాణించలేకపోయారు. 37 బంతుల్లో 7 సిక్స్‌లు ఓ ఫోర్‌తో 72 పరుగులు చేశాడు డు ప్లెసిస్ మ్యాచ్ ని చెన్నై వైపు తిప్పడానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ అతనికి సరైన అండ దొరకలేదు. చివర్లో వచ్చిన ధోని కుదురుకునే లోపు డుప్లెసిస్ అవుట్ అయ్యాడు. ఇక చెన్నై మ్యాచ్ ఓడిపోవడం ఖాయమైన టైములో ధోనీ లాస్ట్ ఓవర్ లో బ్యాక్ టు బ్యాక్ మూడు సిక్స్‌లు కొట్టి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. రాజస్ధాన్ బౌలర్ రాహుల్ తేవాటియా మూడు కీలక వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్‌ను దెబ్బకొట్టాడు.

అంతకుముందు టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫీల్డింగ్‌ ఎంచుకుని.. రాజస్తాన్‌ రాయల్స్‌‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్ మొత్తంలో ధోని చేసిన తప్పు ఏదైనా ఉందా అంటే ఇదే అనే రేంజులో రాజస్ధాన్ టీం బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ వెంటనే అవుట్ అయినా వన్ డౌన్ లో వచ్చిన సంజూ శాంసన్ స్మిత్ తో కలిసి‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెన్నై బౌలర్లకు చుక్కులు చూపించాడు. 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 9 భారీ సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు. రన్ రేట్ 11 మైంటైన్ చేస్తున్న టైములో స్మిత్, సాంసన్ ఇద్దరూ అవుట్ అయ్యారు. ఇక స్కోర్ కంట్రోల్ లోకి వస్తుంది అనుకుంటున్న టైములో చెన్నైకి ఊహించని షాక్ ఇస్తూ, పేస్ బౌలర్ ఆర్చర్ లాస్ట్ ఓవర్ కి 30 పరుగులు కొట్టాడు. ఈ 30 పరుగులే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. ఈ ఒక్కటి జరగకుండా ఉండి ఉంటే మ్యాచ్ హోరాహోరీగా సాగివుండేది.