ఆహా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఒరిజినల్ సినిమా ‘ఇంటింటి రామాయణం’

  • డిసెంబర్‌లో 16 ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం –

ప్రస్తుతం ఆహా తెలుగు ఓటీటీ రంగంలో అగ్రగామిగా ఉంది. ఆహాలో వస్తోన్న షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆహాలో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. ఇందులో నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి వంటి వారు నటించారు. సురేష్‌ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనున్నారు.

మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్‌) కుటుంబం ఓ సమస్యల్లో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. త్వరలోనే ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 21న‌ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసారు.

ఓటీటీలోకి ఇలా తొలిసారిగా ఎంట్రీ ఇస్తుండటంపై సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న మా ఈ చిత్రం ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది.”

కలర్ ఫోటో, భీమ్లా నాయక్‌, డీజే టిల్లు, క్రాక్, అన్‌స్టాపబుల్ షో, డ్యాన్స్ ఐకాన్, తెలుగు ఇండియన్ ఐడల్, అన్యా ట్యూటోరియల్, గీతా సుబ్రహ్మణ్యం, 11th అవర్ వంటి మంచి కంటెంట్ ఉన్న ఆహాలో ఇప్పుడు ఇంటింటి రామాయణం కూడా వచ్చి చేరనుంది. మున్ముందు కూడా ఆహా మరింత మంచి కంటెంట్‌తో ఆడియెన్స్‌ ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.