భారతీయ సినిమా పితామహుడు స్వర్గీయ ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ 151వ జయంతి వేడుకలు!!

భారతీయ సినిమా పితామహుడు స్వర్గీయ రఘుపతి వెంకయ్య నాయుడు 151వ జయంతి వేడుకలు నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి ఉత్తమమైన సేవలందిస్తున్న ప్రముఖ నటుడు డాక్టర్ కాదంబరి కిరణ్ కుమార్, సీనియర్ దర్శక నిర్మాత లక్ష్మణరేఖ గోపాలకృష్ణలను రఘుపతి వెంకయ్య సంస్మరణ అవార్డుతో సత్కరించారు.

ఈసందర్భంగా నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ 20 వ శతాబ్దపు అత్యద్భుపు ఆవిష్కరణల్లో సినిమా ఒకటని అలాంటి సినిమాను భారతదేశంలో వెలుగులోకి తెచ్చిన మహనీయుడు రఘుపతి వెంకయ్య అని అన్నారు. ప్రధాన కార్యదర్శి బాబ్జీ మాట్లాడుతూ సినిమా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహానుభావుడి చరిత్రను సినిమాగా తీసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు.

తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు పి.విజయవర్మ మాట్లాడుతూ సినిమా ఉన్నంత కాలం సినీ చరిత్రపుటల్లో ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచివుంటాయని అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎక్కడో విదేశాల్లో పుట్టిన సినిమాను మన దేశానికి తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేసిన మహనీయుడని, ఈరోజు మనందరం ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నామంటే ఆయన చలువే అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు త్రిపురనేని చిట్టి, సి.యన్.రావు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ధీరజ అప్పాజీ, యానిమేషన్ దర్శకుడు సీతారాం, మితాని ఈశ్వర్, సూరి, వరంగల్ శ్రీనివాస్ పాల్గొని రఘుపతి వెంకయ్య సేవలను‌ కొనియాడారు!!